ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

  • పోలింగ్ ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలి
  • స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు

మోత్కూర్, ఆంధ్రప్రభ : ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని,పోలింగ్ ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావ్ హెచ్చరించారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం స్ధానిక మండల పరిషత్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల విధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు, బాధ్యతలు, అనుసరించాల్సిన సాంకేతిక అంశాలను వివరిస్తూ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భాస్కర్ రావ్ మాట్లాడుతూ.. ఎన్నికల విధి విధానాలపై అధికారులకు సమగ్ర అవగాహన ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించరాదని సూచించారు. ఇతర మున్సిపల్ కేంద్రాలలో ఓటు హక్కు ఉన్న ఎన్నికల సిబ్బంది ఈ నెల 8, 9 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.పోలింగ్ మెటీరియల్ తీసుకునే సమయంలో అధికారులు ఓటర్ జాబితా, బ్యాలెట్ పత్రాలను క్షుణ్ణంగా సరిచూసుకోవాలని ఆదేశించారు. సిబ్బంది ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ రోజున ఎలాంటి లోపాలు తలెత్తకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

ఓటర్ల సౌలభ్యం, పోలింగ్ కేంద్రాల నిర్వహణ, సామగ్రి వినియోగంపై ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. ఎన్నికల సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉన్నందున, ప్రతి అధికారి తన విధిని బాధ్యతగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ ఎన్నికల అధికారి మున్సిపల్ కమిషనర్ కె. సతీష్ కుమార్, స్థానిక తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో బాలాజీ, ఎంపీఓ జనార్దన్ రెడ్డి, పి ఆర్ డి ఈ మంగులాల్, ఆర్ ఓ , ఏ ఆర్ ఓ , పి ఓ, ఏ పి ఓ లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply