ఎల్కతుర్తి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులను సమూలంగా ఏరి వేయడానికి చేపట్టిన ‘ఆపరేషన్ కగార్ తక్షణమే ఆపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనులను, అమాయకులను ఊచకోత కోస్తున్నారని తెలిపారు.
ఎల్కతుర్తిలో నేడు జరిగిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభలో కేసీఆర్ మాట్లాడుతూ, అధికారం చేతిలో ఉందని ప్రాణాలు తీసుకుంటూ పోవడం కరెక్ట్ కాదని అన్నారు.మావోయిస్టులు శాంతి చర్చలకు వస్తామని అంటున్నారని, వెంటనే కూంబింగ్, కాల్పులు ఆపి.. వారితో చర్చలకు ముందుకు రావాలని కేంద్రానికి సూచించారు.
ఆపరేషన్ కగార్ ఆపి, శాంతి చర్చలు జరపాలని కోరుతూ తమ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.
బీజేపీపై విరుచుకుపడ్డ దళపతి
అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు గడిచినా తెలంగాణకు బీజేపీ 11 రూపాయలు ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణ నుంచి 7 మండలాలు లాక్కున్నారని మండిపడ్డారు. తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు కూడా బీజేపీ జాతీయ హోదా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ప్రధాని నరేంద్ర మోడీ తల్లిని చంపి బిడ్డను బతికించారనే నింద తెలంగాణపై మోపారని కేసీఆర్ ఫైర్ అయ్యారు..
ప్రభుత్వాన్ని కూల్చం – ఐదేళ్లపాటు ఉండాలి
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదంటూ స్పష్టం చేసారు కెసిఆర్ ” మా దుబ్బాక ఎమ్మె్ల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో ఎవరో ఇంకా కాంగ్రెస్ను 3 ఏళ్లు భరించాలని అని అన్నారు. దీనికి ఆయన ఏదో సమాధానం చెప్పారు. ఈమాత్రం దానికే తమ ప్రభుత్వాన్ని పడగొడతారా అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. మేమెందుకు మీ ప్రభుత్వాన్ని పడగొడతాం.మేము అలాంటి పనులు చేయ్యం. మీరే ఐదేళ్లపాటు ఉండాలి. ఓట్లు తీసుకున్నారు. మీరు సరిగ్గా పనిచేయకపోతే..ప్రజలే మీకు బుద్ధి చెబుతారు. మీ ప్రభుత్వాన్ని మేము పడగొట్టం. మీ సంగతి ఏంటో, మా సంగతి ఏంటో ప్రజలకు పూర్తిగా అర్థం కావాలి అని అన్నారు కెసిఆర్,