ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) సూచీలు వరుసగా నాలుగోరోజూ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) సూచీలను ముందుండి నడిపించాయి. ఇతర ఆటోమొబైల్ షేర్లు కూడా రాణించడం సూచీలకు కలిసొచ్చింది. గడిచిన నాలుగు సెషన్లలో సెన్సెక్స్ 1400 పాయింట్లకు పైగా లాభపడగా.. నిప్టీ మళ్లీ 25 వేల స్థాయికి చేరువైంది.
సెన్సెక్స్ (Sensex) ఉదయం 81,319.11 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,273.75) స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లో కొనసాగిన సూచీ.. ఇంట్రాడేలో 81,755.88 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 370.64 పాయింట్లతో 81,644.39 వద్ద స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 103.70 పాయింట్ల లాభంతో 24,980.65 వద్ద ముగిసింది. డాలరు (dollars) తో రూపాయి మారకం విలువ 86.95గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, రిలయన్స్, ఎటెర్నెల్, టెక్ మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
బజాజ్ ఫిన్సర్వ్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బీఈఎల్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 65.81 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 3343 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు చాలా వరకు నష్టాల్లో ముగియగా.. ఐరోపా మార్కెట్లు (European markets) లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి.