ముంబై – సుంకాలు అమలులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గడం , ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించడంతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో రోజును ప్రారంభించాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 1,165 పాయింట్లు పుంజుకొని 75,012 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 375 పాయింట్లు ఎగబాకి 22,774 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి 51 పైసలు పెరిగి, 86.18 వద్ద కదలాడుతోంది. 11 గంటల సమయానికి సెన్సెక్స్ 1320 పాయింట్లు,నిఫ్టీ 426 పాయింట్లు లాభంతో దూసుకుపోతున్నాయి.
కోలుకుంటున్న కంపెనీలు ..
సిప్లా, టాటామోటార్స్, టాటా స్టీల్, హిందాల్కో, గ్రాసిమ్ షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా.. టీసీఎస్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. టాటా గ్రూపునకు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి (జనవరి-మార్చి) గానూ కంపెనీ రూ.12,224 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 2 శాతం తగ్గింది. విశ్లేషకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.
నష్టాల భాటలో ఆసియా మార్కెట్లు …
ఇతర దేశాలపై సుంకాలకు ట్రంప్ విరామం ఇచ్చినప్పటికీ.. చైనాపై దూకుడు నిర్ణయాలు కొనసాగించడంతో ఆ ప్రభావం ఆసియా, అమెరికా మార్కెట్లపై పడింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన ఆమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలవైపు మొగ్గుచూపారు. ఈ పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లలోనూ కనిపించింది. దాంతో వాలేట్లో బుధవారం నాటి రికార్డ్ లాభాలు ఆవిరై.. గురువారం మళ్లీ నష్టాల బాట పట్టాయి. ఎస్ అండ్ పీ సూచీ 3.5శాతం, డోజోన్స్ 2.5 శాతం, నాస్ డాక్ 4.3శాతం మేర కుంగాయి. అటు ఆసియా మార్కెట్లు శుక్రవారం ఒత్తిడికి గురవుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 2.28 శాతం, జపాన్ నిక్కీ 5.46 శాతం, దక్షిణ కొరియా కొస్పి 5.05 శాతం మేర కుంగాయి. హాంకాంగ్, చైనా సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి.