ముంబాయి : స్టాక్ మార్కెట్లో నిన్న అధ:పాతాళానికి వెళ్ళి కోట్ల రూపాయలు కరిగిపోయాయి. భారత స్టాక్ మార్కెట్ ఈ ఏడాదిలో రెండవ అతిపెద్ద పతనాన్ని చూసింది.
కానీ ఈరోజు ఉదయానికి పరిస్థితి అంతా మారిపోయింది. నష్టాల్లో ఉన్న సూచీలు ఈరోజు మార్కెట్ ప్రారంభం నుంచే లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 1100 (1.60%) పాయింట్లకు పైగా లాభంతో 74,300 స్థాయిలో ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ కూడా దాదాపు 400 (1.70%) పాయింట్లు పెరిగి 22,550 స్థాయిలో ట్రేడవుతోంది.
సెన్సెక్స్లోని అన్ని స్టాక్స్ అంటే 30 స్టాక్స్ లాభాల్లో పయనిస్తున్నాయి. ముఖ్యంగా మెటల్, ఆటో షేర్లు బాగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో పెరుగుదల వల్లనే భారతీయ మార్కెట్ లాభాలు చూస్తోందని నిపుణులు చెబుతున్నారు.
ఆసియా మార్కెట్లలో.. జపాన్ నిక్కీ ఇండెక్స్ దాదాపు 6% పెరిగింది. అలాగే హాంకాంగ్ ఇండెక్స్ కూడా 2% పెరిగింది. వీటితో పాటూ NSE అంతర్జాతీయ ఎక్స్ఛేంజ్లో ట్రేడవుతున్న నిఫ్టీ కూడా 1.5% పెరిగింది. ఇది మార్కెట్లో అప్ట్రెండ్ను సూచిస్తుంది. అలాగే నిఫ్టీ 50, సెన్సెక్స్ చార్టులు ఓవర్సోల్డ్ RSI స్థాయిలను చూపుతున్నాయి. ఇది షార్ట్-కవరింగ్ , కొత్త కొనుగోళ్లకు దారితీస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు