Stock market | మదుపర్లకు పండుగ… నేడు లాభాలే లాభాలు…

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మన సూచీలు రాణించాయి. కెనడా, మెక్సికో దేశాలపై విధించిన టారీప్ లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లలో పాజిటివ్ సెంటిమెంట్ కు కారణమైంది. వాణిజ్య యుద్ధ భయాలు రేపిన ట్రంప్ నుంచి సానుకూల నిర్ణయం వెలువడడంతో ఆసియాతో పాటు మన మార్కెట్ సూచీల భారీ లాభాలకు కారణమైంది. ఈ క్రమంలో సెన్సెక్స్ ఓ దశలో 1400పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ 23,750 మార్కును అందుకుంది.

సెన్సెక్స్ ఉదయం 77,687.60 పాయింట్ల (క్రితం ముగింపు 77,186.74) వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో దాదాపు 1450 పాయింట్లు లాభపడి 78,658.59 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 1397.07 పాయింట్ల లాభంతో 78,583.81 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 378.20 పాయింట్ల లాభంతో 23,739.25 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 87.07గా కొనసాగుతోంది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.5.5 లక్షల కోట్లు పెరిగి రూ.425 లక్షల కోట్లకు చేరింది.

సెన్సెక్స్ 30 సూచీలో ఎల్అండ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, రిలయన్స్ ప్రధానంగా లాభపడగా.. ఐటీసీ హోటల్స్, జొమాటో, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, మారుతీ నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 75.13 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2847 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *