హైదరాబాద్ – ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో నేడు జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 20 ఓవర్ల లో 286 పరుగులు చేసింది . టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286 పరుగులు సాధించింది. దీంతో రాజస్తాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్ ఉంచింది
సన్ రైజింగ్. …
ఐపీఎల్ అంటేనే పూనకాలు వచ్చినట్టు ఆడే ఇషాన్ కిషన్(106 నాటౌట్) సెంచరీతో గర్జించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న ఈ కుర్ర హిట్టర్.. తొలి మ్యాచ్‌లోనే తన విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో చాటుతూ శతకంతో చెలరేగాడు..
18వ సీజన్ తొలి పోరుకి వేదికైన ఉప్పల్ స్టేడియంలో ఇషాన్, ట్రావిస్ హెడ్(67)లు పరుగుల వరద పారిస్తూ.. రెండొందలకు పైగా కొట్టడం మాకు చాలా సింపుల్ అని మరోసారి నిరూపించారు.
వైల్డ్ ఫైర్ బ్యాటింగ్. .
వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్, ఓపెనర్ ట్రావిస్ హెడ్(67)లు దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపి.. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించారు. వీళ్లిద్దరి విధ్వంసంతో 15 ఓవర్లకే స్కోర్ 200 దాటింది. ఒకదశలో మళ్లీ రికార్డు బ్రేక్ చేసేలా కనిపించిన ఎస్ఆర్హెచ్.. ఆఖర్లో హెన్రిచ్ క్లాసెన్(34) మెరుపులతో .. కమిన్స్ సేన్ ప్రత్యర్థికి 287 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు ఊచకోత..
గత సీజన్ రన్నరప్‌తో సరిపెట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి మరింత కసితో ఆడుతోంది. అభిమానులతో కిక్కిరిసిన ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు ఊచకోత కోశారు. టాస్ ఓడినప్పటికీ.. బౌండరీల మీద బౌండరీలు బాదేస్తూ రాజస్థాన్ బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగించారు.
స్టేడియంలో ఫోర్లు, సిక్సర్లు మోత
నువ్వా నేనా అన్నట్టు పోటీ పడి మరీ ఫోర్లు, సిక్సర్లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(67), అభిషేక్ శర్మ(24)లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. ఈ జోడీని విడదీసేందుకు రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్పిన్నర్ థీక్షణకు బంతి ఇచ్చి ఫలితం రాబట్టాడు. కవర్స్‌లో భారీ షాట్ ఆడిన అభిషేక్ .. యశస్వీ జైశ్వాల్ ఒడుపుగా క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు.
దంచి కొట్టిన హెడ్, ఇషాన్
45 పరుగుల వద్ద తొలి వికెట్‌గా అభిషేక్‌ను వెనుదిరిగాక.. ఇషాన్ కిషన్(106) జతగా హెడ్ దంచాడు. ఆర్చర్ ఓవర్లో.. వరుసగా 4, 6, 4.. ఆఖరి రెండు బంతుల్ని సైతం ఫోర్లుగా మలిచాడు. ఇక థీక్షణ బౌలింగ్‌లో ఇషాన్ , హెడ్ తలా రెండేసి ఫోర్లు బాదడంతో.. ఆరెంజ్ ఆర్మీ జట్టు పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 94 రన్స్ కొట్టింది.
ఆ తర్వాత అర్ధ శతకం సాధించిన హెడ్‌ను తుషార్ దేశ్‌పాండే పెవిలియన్ చేర్చాడు. 134 వద్ద ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయినా.. నితీశ్ కుమార్ రెడ్డి(30)తో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నిర్మించాడు ఇషాన్. వీళ్ల జోరుతో 15వ ఓవర్లోనే జట్టు స్కోర్ 200 దాటింది
ఇషాన్ సెంచరీ..
హెడ్, నితీశ్ రెడ్డిలతో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ఇషాన్.. ఆ తర్వాత క్లాసెన్(34)తోనూ ఇన్నింగ్స్ నిర్మించాడు. 24 బంతుల్లోనే 55 రన్స్ కొట్టిన ఈ ద్వయాన్ని సందీప్ శర్మ విడదీసి రాజస్థాన్‌కు బ్రేకిచ్చాడు. అయితే.. అదే ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాది.. 2 రన్స్ తీసిన ఇషాన్ తొలి సెంచరీ సాధించాడు. 20వ ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్.. తమ రికార్డు స్కోర్ 287ను అధిగమించే అవకాశాన్ని చేజార్చుకుంది

