SRAVANTHI | పదవి గండం..

  • నెల్లూరు నగర మేయర్ స్రవంతి పై అవిశ్వాసం..
  • పావులు కదుపుతున్న అధికార పార్టీ నాయకులు..
  • నవంబర్ 22 తో 4 సంవత్సరాల పదవీకాలం పూర్తి..
  • అవిశ్వాస తీర్మానానికి సిద్దమౌతున్న కూటమి శ్రేణులు..

నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతికి పదవీ గండం ఏర్పడనున్నదా అంటే మారుతున్న సమీకరణాలను బట్టి అవుననే అనాల్సి వస్తోంది. మేయర్ పోట్లూరి స్రవంతి 2021 నవంబర్ లో జరిగిన పురపాలక ఎన్నికల్లో వైసీపీ తరపున కార్పోరేటర్ గా గెలిచి మేయర్ పదవిని దక్కించుకున్నారు.

నెల్లూరు నగరానికి సంబంధించి 54 డివిజన్లు ఉండగా ఆ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 54 డివిజన్లను గెలుచుకున్న వైసీపీ రికార్డు సృష్టించింది. అయితే.. 2024 ఎన్నికల నాటికి పరిస్థితులు మారిపోయాయి.

రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ కార్పోరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నగర నియోజకవర్గం నుంచి కూడా పలువురు వైసీపీ కార్పోరేటర్లు టీడీపీలో చేరిపోవడం జరిగింది. అయితే.. ఆ సమయంలో మేయర్ స్రవంతి మాత్రం వైసీపీలోనే ఉండిపోయారు.

2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తరువాత ఆమె టీడీపీలో చేరేందుకు సంసిద్దత వ్యక్తపరిచినా టీడీపీ ఒప్పుకోలేదు. ముఖ్యంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అసలు అంగీకరించలేదు. ఆమె మేయర్ గా ఎన్నిక కావడంలో శ్రీధర్ రెడ్డి కృషి ఉండటం కీలక సమయంలో ఆమె ఆయనను అనుసరించకుండా పోవడం ఇందుకు కారణంగా ఉంది.

అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్దం
మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే నిబంధనల ప్రకారం.. నాలుగేళ్ళ పదవీ కాలం పూర్తి అయి ఉండాలి. మొన్న నవంబర్ 22 తో ఆ కాలం కూడా పూర్తయింది. ఇక మిగిలింది ఒక్క సంవత్సరం మాత్రమే అయినప్పటికీ.. ఆ ఒక్క సంవత్సరం మాత్రం ఆమెకు పదవి ఎందుకు ఉండాలని భావిస్తున్న టీడీపీ నాయకులు అవిశ్వాస తీర్మానానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఆమె పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మూడింట రెండు వంతుల మంది కార్పోరేటర్లు సంతకాలు పెట్టి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. పేరుకు వైసీపీ కార్పోరేటర్లు అయినా టీడీపీలో చాలా మంది చేరిపోవడంతో సంఖ్యా బలానికి కొదువ లేదు. ప్రస్తుతం మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిల సూచనలతో సంతకాల సేకరణ జరుగుతున్నట్లు సమాచారం.

నేడో రేపో జిల్లా కలెక్టర్ కు కూడా అవిశ్వాస తీర్మానానికి సంబందించి అందజేయనున్నట్లు అనుకుంటున్నారు. అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్పా నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతికి పదవీ గండం తప్పదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply