విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదపడతాయి

విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదపడతాయి

  • సీపీ సాయి చైతన్య, ఐపీఎస్

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : గిరిరాజ్ ప్రభుత్వ (జి.జి.) కళాశాలలో శనివారం క్రీడా విభాగం ఆధ్వర్యంలో క్రీడామహోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ సి.పి. సాయి చైతన్య, ఐపీఎస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో మనం ఏ స్థాయిలో ఉండాలో, ఎటువంటి సమాజాన్ని కోరుకుంటున్నామో తగిన ప్రణాళికలతో కళాశాల చదువు కొనసాగించాలన్నారు.

చదువు ఎక్కడ నుండైనా కొనసాగించవచ్చని, కానీ కళాశాలకు వచ్చి చదవడం ద్వారా సమాజానికి తగిన విధంగా వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు కళాశాల దశలో దారి తప్పే ప్రమాదం ఉంటుందని, వ్యసనాలకు గురి కాకుండా క్రీడల్లో పాల్గొంటే మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యవంతంగా ఉండేందుకు దోహదపడుతాయని అన్నారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పి. రామ్ మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కళాశాల ప్రగతి, అధ్యాపకులు, విద్యార్థులు సాధించిన విజయాలను వివరించారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బాలమణిని ప్రత్యేకంగా ప్రశంసించారు. వివిధ క్రీడల్లో విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కళాశాలలో నిరంతరం క్రీడలను నిర్వహించడం గొప్ప విషయమని అభినందించారు. ఈ విద్యా సంవత్సరానికి ఫిజికల్ సైన్స్ విభాగం ఓవరాల్ చాంపియన్‌షిప్ గెలుచుకోగా, కామర్స్ విభాగం ద్వితీయ స్థానంలో నిలిచింది.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఆచార్య రంగరత్నం, పరీక్షల నియంత్రణ అధికారి భరత్ రాజ్, పీఆర్‌ఓ దండు స్వామి, ఎన్‌సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ రాజేష్, అకడమిక్ కోఆర్డినేటర్ నహీదా బేగం, కామర్స్ విభాగాధిపతి వినయ్ కుమార్, ఏఓ రామ్ కిషన్, సూపరింటెండెంట్ ఉదయభాస్కర్, అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.

Leave a Reply