భూసేకరణ పనులు వేగవంతంగా చేపట్టండి
ఊట్కూర్, అక్టోబర్ 22 (ఆంధ్రప్రభ) : నారాయణపేట – కొడంగల్ (NarayanaPet- Kodangal) ఎత్తిపోతల పథకంలో భాగంగా జీవో 69 భూసేకరణ పనులు వేగవంతంగా చేపట్టాలని నారాయణ పేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్లో అధికారులు జాప్యం చేస్తే.. కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ తాహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయంలో భూ సేకరణ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూభారతి సాదా బైనామా దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ (Indiramma’s house construction) పనుల్లో అలసత్వం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సాదా బైనమాల దరఖాస్తులు 364 వచ్చాయని కొత్తగా వచ్చిన జిపిఓలతో సర్వే చేస్తున్నామని తాహాసిల్దార్ చింత రవి కలెక్టర్ కు వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఇసుక కొరత కారణంగా పనులు ముందుకు సాగడం లేదని ఇన్చార్జి ఎంపీడీవో లక్ష్మీనరసింహరాజు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పనులు త్వరగా చేపట్టే విధంగా చూడాలని ఏవైనా సమస్యలు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. తాహసిల్దార్ ఎంపీడీవో కార్యాలయాల్లో అధికారులతో పలు అంశాల పై చర్చించారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ చింత రవి, ఎంపీడీవో లక్ష్మి నరసింహారాజు, ఉపాధి హామీ ఎపిఓ లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
