specialty doctors | మాతా–శిశు సంరక్షణపై ఆకస్మిక తనిఖీలు

specialty doctors | మాతా–శిశు సంరక్షణపై ఆకస్మిక తనిఖీలు
- సి–సెక్షన్‌లపై ఆడిట్… లోపాలపై ఉన్నతాధికారులకు నివేదిక
specialty doctors | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లాలో పలు చోట్ల ఈ రోజు మాతా–శిశు(Mother and child) సంరక్షణ కార్యక్రమాలపై రాష్ట్రస్థాయి వైద్య బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ (మాతా శిశు సంరక్షణ) డాక్టర్ సుధీర్ నేతృత్వంలోని బృందం జిల్లాలోని పలు ప్రభుత్వ వైద్య సంస్థల(health institutions)ను సందర్శించి సేవల అమలును సమీక్షించింది.
ఈ తనిఖీల్లో జాతీయ ఆరోగ్య మిషన్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ డాక్టర్ పద్మ, డాక్టర్ శిల్పారెడ్డి, డాక్టర్ విక్రమ్, డాక్టర్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రితో పాటు కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వ్యాపాల ఉప కేంద్రం, జిల్లా కేంద్రంలోని మాతా–శిశు సంరక్షణ కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమాలను బృందం పరిశీలించింది.

గర్భవతుల నమోదు, వారికి అందిస్తున్న వైద్య సేవలు(medical services), శిశు సంరక్షణ విభాగంలో సూపర్ స్పెషాలిటీ వైద్యుల ద్వారా జరుగుతున్న చికిత్సలు, ఆసుపత్రిలో నమోదైన గర్భిణుల వివరాలు, సాధారణ ప్రసవాలు–సిజేరియన్ ప్రసవాలపై సమగ్ర ఆడిట్ నిర్వహించారు. ప్రత్యేకంగా సి–సెక్షన్‌లకు సంబంధించి నర్సింగ్ అధికారుల ద్వారా ఆడిట్ పత్రాలను వెరిఫై చేశారు. రిఫర్ చేసిన కేసుల వివరాలను పరిశీలించిన బృందం, ఏ కారణాలతో రిఫరల్ చేశారనే అంశంపై జస్టిఫికేషన్(justification) కోరుతూ సంబంధిత వైద్యులకు సూచనలు చేసింది.
ఎక్కడి నుంచి వచ్చిన కేసులు అదే ఆసుపత్రిలో సక్రమంగా నమోదు కావాలని, చిన్న తప్పిదాలకైనా తావివ్వకూడదని స్పష్టం చేసింది. మాతృ మరణాలు, శిశు మరణాలను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా అన్ని స్పెషాలిటీ వైద్యులు(specialty doctors), వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా హెల్ప్ డెస్క్ సిబ్బంది ఈ నెలలో ప్రసవానికి ఉన్న గర్భవతుల వివరాలను ముందుగానే సేకరించి, ఫోన్ ద్వారా వారిని సంప్రదిస్తూ అవసరమైన సూచనలు, ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు.
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి, కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వ్యాపాల ఉప కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాలు, గర్భవతుల రికార్డులను బృందం పరిశీలించింది. వైద్య సేవల అమలులో ఏ విధమైన లోపాలు కనిపించినా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఈ తనిఖీల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత, డాక్టర్ వేదవ్యాస్, డాక్టర్ భీష్మ, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ అరుణశ్రీ, డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ రవి, డాక్టర్ దివ్య(Dr. Divya)తో పాటు వైద్యులు, నర్సింగ్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సిహెచ్ఓలు వెంకటేశ్వర్లు, సత్తయ్య, నామ్దేవ్ కూడా హాజరయ్యారు. జిల్లాలో అందిస్తున్న మాతా–శిశు వైద్య సేవల పూర్తి నివేదికను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌కు, మంచిర్యాల జిల్లా కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
