Special Pujas | హంసలదీవి, మంగినపూడి బీచ్ వద్ద భక్తుల రద్దీ

Special Pujas | హంసలదీవి, మంగినపూడి బీచ్ వద్ద భక్తుల రద్దీ
- భక్తజన సంద్రంతో పోటెత్తిన సముద్రం తీరం
Special Pujas | కృష్ణా బ్యూరో, ఆంధ్రప్రభ : మాఘశుద్ధ పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని మచిలీపట్నం, కోడూరు హంసలదీవి వద్ద భక్తులు పోటెత్తారు. హంసలదీవి పుణ్యక్షేత్రంలో పవిత్ర సింధూ స్నానాలు ఆచరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో రావటంతో హంసలదీవి సాగర తీరం భక్తజన సంద్రంతో పోటెత్తింది. ఆదివారం వేకువజాము నుంచి తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి సాగరతీరంలో పుణ్యస్నానాలు ఆచరించారు.

సముద్ర తీరం వెంబడి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింధు స్నానాలకు 35 వేల మందికిపైగా భక్తులు విచ్చేస్తారన్న అంచనాలతో పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీసు, మెరైన్, ఫారెస్టు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 35 వేల మంది భక్తులు వరకు పుణ్యస్థానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ వద్ద కూడా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి పుణ్య స్థానాలు ఆచరించారు. మార్గ శుద్ధ పౌర్ణమి సందర్భంగా పుణ్య స్థానాలు ఆచరిస్తే పాప విముక్తి కలుగుతుందని భక్తులు ప్రగాఢ విశ్వాసం ఉంచుతారు.

మెరైన్, పోలీసుల ఆధ్వర్యంలో సముద్ర స్నానాలు ఆచరించే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు నిర్వహించారు. సముద్రం లోతుకి వెళ్లి స్నానాలు చేయవద్దని సూచనలు చేశారు. వేలాదిమంది భక్తులు రావడంతో సముద్ర తీర ప్రాంతమంతా సందడి వాతావరణం కనిపించింది. చిన్నారులు ఆహ్లాదంగా సముద్రంలో స్నానాలు ఆచరించారు. మహిళలు ప్రత్యేకంగా సూర్య నమస్కారాలు చేశారు. పలువురు మహిళలు, యువతులు సముద్రునికి హారతులు ఇవ్వడం జరిగింది. హంసలదీవి వద్ద మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ చర్యలు నిర్వహించారు.


CLICK HERE TO READ క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా ఆర్చరీ టోర్నమెంట్..
