బస్సుల ఫిట్‌నెస్‌, పార్కింగ్‌, పికప్‌, డ్రాపింగ్‌పై ప్రత్యేక దృష్టి

బస్సుల ఫిట్‌నెస్‌, పార్కింగ్‌, పికప్‌, డ్రాపింగ్‌పై ప్రత్యేక దృష్టి

ర‌వాణా శాఖ అధికారుల‌తో మంత్రుల సమీక్షా సమావేశం

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 16న కర్నూలులో జరగనున్న సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభకు సంబంధించి రవాణా ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు రవాణా శాఖ అధికారులతో కర్నూలులోని ఒక ప్రైవేట్ హోటల్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, కర్నూల్ రీజినల్ ఆర్టీసీ చైర్మన్ నాగరాజు, రవాణా శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సభా ప్రాంగణానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున, బస్సుల ఫిట్‌నెస్‌, పార్కింగ్‌ ఏర్పాట్లు, పికప్–డ్రాపింగ్‌ సదుపాయాలు వంటి అంశాలపై అధికారులు పకడ్బందీ ప్రణాళికతో పని చేయాలని మంత్రులు సూచించారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా, ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా సకాలంలో సభా వేదికకు చేరుకునేలా మార్గాలను స్పష్టంగా గుర్తించి వాహనాల రాకపోకలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మున్సిపల్ మంత్రి డాక్టర్ నారాయణ మాట్లాడుతూ, “ప్రధాని పర్యటన రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకమైనది. ప్రజా రవాణా సదుపాయాలు క్రమబద్ధంగా ఉంటే సభ విజయవంతం అవుతుంది,” అన్నారు. ఆర్ అండ్ బి మంత్రి జనార్దన్ రెడ్డి రహదారి మరమ్మత్తులు, సిగ్నలింగ్‌ వ్యవస్థలపై దృష్టి పెట్టాలని సూచించగా, విద్యుత్ మంత్రి రవికుమార్ సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, సభకు వచ్చే ప్రతి బస్సు ఫిట్‌నెస్‌ టెస్టు పూర్తి చేసి మాత్రమే రోడ్డెక్కాలి. ప్రజల భద్రతకు ఎటువంటి రాజీ ఉండకూడదు. సమన్వయంతో పని చేస్తే ఈ సభ చారిత్రాత్మకంగా నిలుస్తుంది,అన్నారు. మంత్రుల ఈ సమీక్షతో రవాణా శాఖ అధికారులు సభా ఏర్పాట్లను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు.

Leave a Reply