ఆందోళనలో పని దొంగలు
అప్రమత్తమైన పోలీసులు
శ్రీ సత్యసాయి బ్యూరో, అక్టోబర్ 19 (ఆంధ్రప్రభ): ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ జిల్లా వ్యాప్తంగా గల పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఆయా స్టేషన్లలో పనిచేసే పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా విధులకు తరచూ డుమ్మా కొట్టే పని దొంగలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎస్పీ సతీష్ కుమార్ పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్, బుక్కపట్నం, కొత్తచెరువు అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ తో పాటు జిల్లా పోలీస్ కార్యాలయానికి అర్ధరాత్రి వరకు తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా నేరాల నియంత్రణ, అక్రమ రవాణా, ప్రజల భద్రత, అసాంఘిక కార్యకలాపాలు పూర్తి అరికట్టే దిశగా ఎస్పీ దృష్టి సారించినట్లు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాత్రిపూట పోలీసులు గస్తీ తిరగడం, పెట్రోలింగ్, తనిఖీలు చమ చేస్తున్నారా లేదా అనే విషయాలను ఆయనే స్వయంగా పరిశీలించారు. రాత్రి పూట సిబ్బంది ఆయా స్టేషన్‌లో ఎంతమంది విధులు నిర్వహిస్తున్నారు. ఎవరూ ఎలాంటి విధులు నిర్వహిస్తున్నారు. అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, నేరాలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా విధుల్లో ఉన్న పోలీసులకు ఎస్పీ సూచించారు.