రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు అత్యవసరం

రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు అత్యవసరం

సాంకేతికతతో కేసుల దర్యాప్తు వేగవంతం
జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ, బాధితులకు తక్షణ సహాయం, ప్రమాదాల నివారణపై జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డీ పోలీసు అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన నేర సమీక్ష సమావేశంలో పెండింగ్ కేసులు దర్యాప్తు, రోడ్డు ప్రమాదాలు నివారణ చర్యలు, డ్రోన్లు,సాంకేతిక అప్లికేషన్ల వినియోగం, కేసుల పురోగతి, ఆన్‌లైన్ పోర్టల్స్‌లో సమాచారం నమోదు విధానాల అంశాలపై జిల్లా ఎస్పీ సమీక్షించారు.


ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,రోడ్డు ప్రమాదాలు జరిగిన అనంతరం చర్యలు చేపట్టడంకన్నా ముందస్తు నివారణ చర్యలు చేపట్టడం వల్ల ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు . ప్రమాదాలకు దారితీసే కారణాలను ముందుగానే గుర్తించి, తగిన నివారణ చర్యలు అమలు చేయడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.

ఈ నేపథ్యంలో ట్రాఫిక్, భద్రత నియమాల అమలును కఠినంగా పర్యవేక్షించడం, హెల్మెట్ రహిత డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాలకు కారణమయ్యే బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి సరిచేయడం, రోడ్డు భద్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం వంటి చర్యలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.ప్రమాదాలు జరిగిన వెంటనే ప్రారంభమయ్యే తొలి గంటను గోల్డెన్ అవర్ గా పరిగణిస్తారని, ఈ సమయంలో ప్రమాద బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు.

ప్రమాద బాధితులకు సకాలంలో సహాయక చర్యలు అందించాలని తెలిపారు .కేసుల దర్యాప్తు,వేగవంతమైన విచారణ సాధించడంలో సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత స్మార్ట్ పోలీసింగ్ కీలకమని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. అసాంఘిక,చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు అదేవిధంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు డ్రోన్లు వినియోగం పెంచాలన్నారు. పెండింగ్ లో ఉన్న ముఖ్యమైన కేసులు దర్యాప్తులో పురోగతి సాధించాలని పలు అంశాలపై పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ దిశ నిర్దేశం చేశారు.

Leave a Reply