సోలార్ విద్యుత్ సరఫరా పనుల నిలిపివేత

సదాశివనగర్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో సోలార్ విద్యుత్ సరఫరా పనులను శనివారం గ్రామస్తులు అడ్డుకుని నిలిపివేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వంకాయల శిరీష రవి మాట్లాడుతూ గ్రామ శివారులో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న ప్రైవేట్ కంపెనీ యజమానులు గ్రామపంచాయతీకి సమాచారం ఇవ్వకుండానే వారికి నచ్చిన విధంగా ఇండ్లపై నుండి విద్యుత్ స్తంభాలకు తీగలు ఏర్పాటు చేశారని తెలిపారు.
గ్రామ సర్పంచ్ కు సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా గ్రామంలో నుండి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి, విద్యుత్ సరఫరాకు తీగలు ఏర్పాటు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోలార్ విద్యుత్ సరఫరా పనులు నిలిపివేయాలని గ్రామస్తులు అభ్యంతరం తెలుపుతున్నారన్నారు.ఊరు బయట నుండి విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ప్రజలు ఇబ్బందులు పడే పనులు చేపడితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
