పోలీస్ గ్రీవెన్స్‌కు 85 ఫిర్యాదులు…

పోలీస్ గ్రీవెన్స్‌కు 85 ఫిర్యాదులు…

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం: ఎస్పీ విక్రాంత్ పాటిల్.

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమంలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కర్నూలు కొత్తపేటలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల వినతులను స్వీకరించి, వారితో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 85 ఫిర్యాదులు అందాయి. ఉద్యోగాల పేరుతో మోసాలు, ఆస్తి వివాదాలు, పెట్టుబడి మోసాలు, తాకట్టు బంగారం తిరిగి ఇవ్వకపోవడం వంటి పలు అంశాలపై ఫిర్యాదులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని నకిలీ నియామక పత్రం ఇచ్చి రూ.4.80 లక్షలు వసూలు చేసిన ఘటనపై కల్లూరు మండలానికి చెందిన ఫణి ఫిర్యాదు చేశాడు.

అలాగే బెంగళూరులో ఉద్యోగం కల్పిస్తామని చెప్పి రూ.1.10 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటనపై పసుపుల గ్రామానికి చెందిన సాయి ఫిర్యాదు చేశాడు. సోలార్ కంపెనీ, ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి దుస్తులు, ఐడి కార్డులు ఇచ్చి మోసం చేసిన ఘటనపై పందిపాడు గ్రామానికి చెందిన విజయ్ కుమార్ ఫిర్యాదు చేశాడు. ఎమ్మిగనూరులో తాకట్టు పెట్టిన బంగారం తిరిగి ఇవ్వకుండా పరారైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎర్రకోట ప్రాంతానికి చెందిన పలువురు ఫిర్యాదు చేశారు.

ఆస్తి పంచుకోలేదని ఇబ్బందులకు గురిచేస్తున్న కుటుంబ వివాదం, కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకుని మోసం చేసిన ఘటనలు, ప్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన కేసులు కూడా ఫిర్యాదుల్లో ఉన్నాయి. ప్రజా ఫిర్యాదులపై తక్షణ స్పందన చూపాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. అన్ని ఫిర్యాదులపై వేగంగా విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా, సీఐలు శివ శంకర్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply