రాజకీయ నేరస్థులతో ప్రమాదం
పెట్టుబడులు రానివ్వరు
శాంతి భద్రతతోనే పెట్టుబడులు సాధ్యం
రక్షణపై నమ్మకంతోనే గూగుల్ వచ్చింది
సోషల్ మీడియా నేరాలు దారుణం
పోలీసుశాఖకు ఓ సవాలు
పోలీసుల గౌరవం పెంచుతాం
పోలీసు కుటుంబాల సంక్షేమం భాద్యత మాదే
పోలీసు అమరవీరుల సంస్మరణలో సీఎం చంద్రబాబు
గుంటూరు మంగళగిరి, ఆంధ్రప్రభ): రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతలపై విశ్వాసంతోనే గూగుల్ లాంటి దిగ్గజ ఐటీ సంస్థ ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. వాటిని సంరక్షించటంలో పోలీసు శాఖ కీలకపాత్ర పోషించాలని సూచించారు. పోలీస్ అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ అమర వీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి నివాళులర్పించారు.

పోలీసు సంస్మరణ దినం ఫ్లాగ్ ధరించి.. ఫ్లాగ్ ఫండ్ కు విరాళం ఇచ్చారు. పోలీసుల గౌరవం పెంచటంతో పాటు వారి కుటుంబాల సంక్షేమం చూసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏపీ పోలీస్ అంటే ఓ బ్రాండ్ అని.. దానికి మరింత వన్నె తెచ్చేలా పని చేయాలని సీఎం పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పోలీసులను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం ”దేశంలో శాంతిభద్రతల కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమర వీరులకు నివాళులు అర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. 1959 అక్టోబర్ 21న చైనాపై వీరోచిత పోరాటంలో సీఆర్పీఎఫ్ కు చెందిన 10 మంది జవాన్లు అమరులయ్యారు. వారిని స్మరించుకుంటూ ప్రతీ ఏటా అక్టోబర్ 21న, పోలీస్ అమర వీరుల దినాన్ని నిర్వహించుకుంటున్నాం. వారి త్యాగాలను, బలి దానాన్ని గుర్తు చేసుకుంటూ స్ఫూర్తి పొందుతున్నాం. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారు. వీరికి నివాళులు అర్పిస్తున్నాను. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్న పోలీసులు అంటే నాకెప్పుడూ గౌరవం. పోలీసులు చేసేది ఉద్యోగం కాదు..నిస్వార్థ సేవ.” అని అన్నారు.
ఈగల్- శక్తి బృందాలే ఆదర్శం
“శాంతిభద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధ్యం. అప్పుడే సంక్షేమం అందరికీ అందుతుంది. ఉపాధి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అప్పుడే కుటుంబంలో, సమాజంలో సుఖ శాంతులు ఉంటాయి. ఇవన్నీ ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. సమాజంలో అలజడి ఉంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పై ఖచ్చితంగా ఉంటాను. తమ పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయనే నమ్మకంతో పరిశ్రమలు, కంపెనీలు వస్తాయి. అదే నమ్మకంతో విశాఖలో గూగుల్ పెట్టుబడులు పెట్టింది.

విశాఖలో గూగుల్ పెడుతున్న పెట్టుబడులు దేశంలోనే అతి పెద్ద పెట్టుబడి. 15 బిలియన్ డాలర్లతో ఏఐ డేటా హబ్ విశాఖలో ఏర్పాటు చేస్తున్నారు. పెట్టుబడులు వచ్చినప్పుడే అభివృద్ధి జరుగుతుంది. అప్పుడే ఏపీ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది. ఏపీ పోలీసులు అంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజంను అణిచి వేయడంలో ఏపీ పోలీసులు ఎంతో పేరు తెచ్చుకున్నారు. పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి. సిద్దాంతం పేరుతో, ఆధిపత్యం కోసం, డబ్బుల కోసం నేరాలు చేసే వారు ఉన్నారు. ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట పడాలి. నేరాల తీరు మారుతోంది. క్రిమినల్స్ అప్ డేట్ అవుతున్నారు. వారి ఆట కట్టించాలంటే పోలీసు శాఖ కూడా అప్డేట్ అయి ఉండాలి. అందుకే సాంకేతికంగా పోలీసు శాఖను బలోపేతం చేస్తున్నాం. సీసీ టీవీ కెమెరాలు, డ్రోన్లు, ఫోన్ సిగ్నల్స్, గూగుల్ టేకవుట్… ఇలా టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రతీ 50 మీటర్లకి ఒక సీసీ కెమేరా ఏర్పాటు చేస్తున్నాం. ఇది పోలీస్ యంత్రాంగానికి మూడో కన్నులా పనిచేస్తుంది. ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా రికార్డెడ్‌గా పట్టుకునే వీలు కలుగుతుంది. టెక్నాలజీకి అనుగుణంగా శిక్షణ, అధునాతన పోలీస్ స్టేషన్లు, ఈగల్ , శక్తి బృందాల ఏర్పాటుతో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఆదర్శంగా నిలిచింది. డ్రోన్లతో గంజాయి పంటను గుర్తించి ధ్వంస చేస్తున్నారు. స్మగ్లింగ్‌ను అరికడుతున్నారు. అడవుల్లో డ్రోన్లు ఎగరేసి ఎర్ర చందనం దొంగలను కట్టడి చేస్తున్నారు. ఈ విషయంలో పోలీసు శాఖకు అభినందనలు. డబ్బుల కోసం రౌడీయిజం చేసే ముఠాలుగా మారుతున్న వారిని కట్టడి చేయాలి. తప్పు చేసే వారికి పోలీస్ అంటే భయం ఉండాలి. అప్పుడే నేరాలు తగ్గుతాయి.” అని ముఖ్యమంత్రి అన్నారు.
రాజకీయ ముసుగులో వస్తున్నారు
సమాజంలో అశాంతి సృష్టించి…లబ్ది పొందడం కోసం రాజకీయ ముసుగులో కొత్త నేరగాళ్లు తయారయ్యారు . వీళ్లు అసలు క్రిమినల్స్ కంటే ప్రమాదం. మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. సమాజంలో అశాంతిని సృష్టించడానికి రాజకీయ కుట్రలు చేస్తున్నారు. ఫేక్ ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఇలాంటి వాటి విషయంలో పోలీసులు మరింత అలెర్ట్ గా ఉండాలి. పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని మతాల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేశారు. దీనికి రాజకీయాన్ని జోడించే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో సీసీ కెమెరాలతో వాస్తవాలు బయట పెట్టగలిగాం. జీడీ నెల్లూరు మండలంలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి వేరే వారిపై నెపం నెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూశారు. సీసీ టీవీలు ఉండటంతో నేరస్తులు దొరికారు. లేదంటే జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని రచ్చ చేసేవారు. కల్తీ మద్యంపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దోషులు ఏ పార్టీ వారైనా చర్యలు తీసుకోవాలని చెప్పాం. రాష్ట్రంలో ఎవరు చనిపోయినా మద్యంతోనే అని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న దుష్ప్రచారం, నేరాలు పోలీసులకు అతి పెద్ద ఛాలెంజ్. ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి.. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో పెట్టే అసభ్యకర పోస్టుల విషయంలో చాలా మంది కుమిలిపోతున్నారు. శాంతి భద్రతలకంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. ఆడబిడ్డలపై అరాచకం చేస్తే.. అదే చివరి రోజు అనిపించేలా పోలీసులు కఠినంగా ఉండాలి. ప్రజలకు పోలీసులు అండగా ఉండాలి.. ప్రభుత్వం పోలీసులకు అండగా ఉంటుంది.” అని సీఎం స్పష్టం చేశారు.
పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం
ఆధునికీకరణలో టెక్నాలజీలో పోలీస్ శాఖ ముందుండాలి. నూతన పాలసీలు తీసుకొచ్చాం. గ్రేహౌండ్స్ ను చాలా పటిష్టంగా తయారు చేశాం. రౌడీయిజం చేయాలనుకున్న వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించాం. సైబర్ నేరాలకు పాల్పడాలంటే భయపడాలి. నేరాల కట్టడి విషయంలో కఠినంగా వ్యవహరించాలి. శాంతి భద్రతల విషయంలో నేను ఏనాడూ రాజీపడలేదు. అందుకే నా పై నక్సలైట్లు క్లైమోర్ మైన్లతో దాడి చేశారు. మనం చేసే పనులే శాశ్వతం. మంచి పనులు చేస్తున్న పోలీస్ శాఖను అభినందిస్తున్నా. పోలీసుల వైద్య సేవలకు 16 నెలల్లో రూ.33 కోట్లు విడుదల చేశాం. మరణించిన 171 మంది పోలీసులకు బీమా కింద రూ.23 కోట్లు అందించాం. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించాం. పోలీస్ సోదరులకు ఒక సరెండర్ లీవ్ రెండు విడతల్లో చెల్లిస్తాం. 6,100 కానిస్టేబుల్ నియామకాలను పూర్తి చేశాం. శాఖాపరమైన పదోన్నతులు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ లక్ష్యం కావాలి. దీనికి శాంతి భద్రతలు చాలా ముఖ్యం. విపత్తులు, కరోనా లాంటి మహమ్మారి వంటివి వచ్చినా… ముందుండి ప్రజల కోసం పోలీసులు మొదటి అడుగులు వేశారు. పోలీసులు తమ విధుల కోసం కుటుంబాన్ని సుఖ సంతోషాలను త్యాగం చేస్తున్న పోలీస్ కుటుంబాలకు నమస్కారాలు.”అని ముఖ్యమంత్రి వెల్లడించారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సీఎం సందర్శించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.