SLBC – టన్నెల్ లో ప్రమాదం .. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలకు రేవంత్ ఆదేశం
హైదరాబాద్ – ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు. లోపల చిక్కుకున్న కార్మికులను సురక్షింతంగా బయటకు తెచ్చి వారికి అత్యవసరవైద్యం అందించాని కోరారు.. అవసరమైతే గాయపడిన కార్మికులను హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ లోని ఆసుపత్రులకు తరలించాలని సూచించారు..ఇలా ఉంటే ముఖ్యమంత్రి ఆదేశాలతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్ , ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలీకాప్టర్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు.ఇక నాగర్ కర్నూలు లో ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ప్రమాద స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు..
పనులు జరుగుతుండగా ప్రమాదం ..
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద మూడు మీటర్ల మేర పై కప్పు పడిపోయింది. ఈరోజు ఉదయం 8:30 గంటలకు ప్రమాదం జరిగింది .ఎస్ఎల్‌బీసీ ఎడమవైపు సొరంగం పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. అయితే నాలుగు రోజుల క్రితమే ఎడమవైపు సొరంగం పనులు మొదలయ్యాయి. ఇంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టన్నల్ బోర్ మెషిన్‌తో పని జరుగుతున్నప్పుడు అక్కడ ఏడుగురు కార్మికులు విధులలో ఉన్నారు. దీంతో ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక టన్నెల్ ప్రమాద సమయంలో 50 మందికి పైగా కార్మికులు వివిధ ప్రాంతాలలో పని చేస్తున్నారు.. ప్రమాద సమయంలో భారీ శబ్ధం రావడంతో చుట్టుపక్కల పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై బయటకు పరిగెత్తారు. ఇక నాగర్ కర్నూలు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ ప్రమాద స్థలానికి ఇప్పటికే చేరుకున్నారు. ఆయన స్వయంగా సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు.
ఆ లక్ష్యంతోనే..
నల్లగొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) సొరంగం ప్రాజెక్టును రూపొందించారు. 2005లో ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టుకు నాటి వైఎస్సార్ ప్రభుత్వం రూ. 2,200 కోట్లతో పరిపాలన అనుమతులు జారీ చేసింది. రూ.1925కోట్లతో సుమారు 60 నెలల్లో పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ పనులు పొందింది. శ్రీశైలం జలాశయం నుంచి నల్లగొండ జిల్లాకు 30టీఎంసీల కృష్ణ జలాలను తరలించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం.
మూలన పడ్డ పనులు..
అయితే టన్నెల్ బోరింగ్ మిషన్‌తో సొరంగం త్రవ్వకం చేపట్టగా సాంకేతిక సమస్యలు, వరద సమస్యలతో పనులు ఆగుతూ సాగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ మరమ్మతులకు గురవ్వడం.. నిధుల కేటాయింపులు లేకపోవడంతో సొరంగం ప్రాజెక్టు పనులు 2019 డిసెంబర్ నుంచి మూలపడ్డాయి. అయితే నల్లగొండ మంత్రుల చొరవతో ఈ మధ్యే పనులు మళ్లీ మొదలయ్యాయి. ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఆరుసార్లు ఈ ప్రాజెక్టు పనుల గడువును పొడిగించాయి. తాజా గడువు కూడా జూన్ 2026 వరకు ఉంది. 2017లో ఈ ప్రాజెక్టు అంచనాలను రూ.3,152.72కోట్లకు పెంచగా.. ఈ మధ్యే మరోసారి 4,637కోట్లకు పెంచారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటిదాకా రూ.2,646కోట్లు ఖర్చు చేశారు.