సహకరించని జేపీ కంపెనీ
సహాయక బృందాల ఆగ్రహం
అధికారుల జోక్యంతో 12.10 గంటలకు సొరంగంలోకి వెళ్లిన దళాలు
ఆంధ్రప్రభ, అచ్చంపేట : దోమపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడను గుర్తించేందుకు సహాయక బృందాలు తానా తంటాలు పడుతున్నాయి. సొరంగంలో బురదను దాటేందుకు వీలు పడని స్థితిలో అవాంతరం తప్పలేదు. తమతో పాటు జేపీ ప్రతినిధులు కూడా లోనికి రావాలని సహాయక చర్యల్లో పాల్గొన్న బృందాలు కోరగా.. ఈ సహాయక చర్యలు తమ బాధ్యతకాదని జేపీ కంపెనీ నిరాకరించటంతో.. 12 గంటలకు సహాయక చర్యలు ప్రారంభం కాలేదు. ఇక ఈ పనులను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ సహాయ దళాలతో మాట్లాడి ఒప్పించారు. ఇంతలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు దోమపెంటకు చేరుకున్నారు. అక్కడే ఉన్న అధికారులతో సమీక్ష ప్రారంభించారు. ఇక 12.10 గంటలకు 30 మంది ఎన్డీఆర్ఎఫ్ దళ సభ్యులు, 12 మంది ర్యాట్ హోల్ మైనర్లు , 22 మంది మెయిల్ కంపెనీ ఇంజనీర్లు లోకో ట్రెయిన్ లో సొరంగంలోకి వెళ్లారు.
ఆ 40 మీటర్లే ప్రతి బంధకం
ఉదయం 8.00 గంటలకు సొరంగంలోకి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు వెనక్కి వచ్చాయి. కాలు మోపితే శరీరం నడుము లోతు బురదలో కూరుకుపోతుంది. ఒక ఊబి వాతావరణం కనిపించింది. అలా జరక్కుండా వెదురు బొంగుల నిచ్చెనలు, ధర్మకోల్ షీట్ తెప్పలు వినియోగిస్తున్నారు. బురదపై వాటిని వేసి, నెమ్మదిగా నడుచుకుంటూ బురదను దాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రమాద స్థలిని చేరుకునేందుకు 40 మీటర్ల బురదలో ముందుకు పోవాలి. అక్కడకు చేరుకునేందుకు డ్రోన్లను వినియోగించనున్నారు. బురదలలో ఏముందో తెలుసుకునేందుకు ఎండోబోట్ కెమెరా, ఎండోబోట్ పుష్ కెమెరాలను వినియోగిస్తున్నారు. ప్రోగో స్కోప్ కెమెరాను వినియోగిస్తున్నారు. బురదలో పైల్ లాంటి మీడియంను వేసి అందులోంచి ప్రత్యేకమైన ఫైబర్‌ను పంపుతారు. ఫైబర్ కేబుల్ చివరన కెమెరా ఉంటుంది. బురదలో పైపు ద్వారా లోపలికి వెళ్లే కెమెరా ద్వారా లోపల ఏముందో తెలుసుకోవచ్చు.
సమాచారమే దొరకట్లే
120 మీటర్ల వరకూ కెమెరాను సొరంగ మార్గంలో లోపల ప్రస్తుతం ఎలాంటి సమాచార వ్యవస్థ లేదు. సొరంగం లోపలికి వెళ్లిన బృందాలు జీపీఐ యాంటెనా సిగ్నల్స్ పనితీరును పరిశీలించేందుకు అందుకు సంబంధించిన పరికరాలన్నీ లోపలికి తీసుకువెళ్లాయి. ఈ బృందాలు బయటకు వస్తే సహాయక చర్యల్లో పురోగతిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, సింగరేణి కాలనీస్, హైడ్రా, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ ఇలా అనేక రంగాల్లో 9 సంస్థల నిపుణులు సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఒక ఎక్స్వేటర్ను ట్రెయిన్లో లోనికి పంపించారు.