Singareni | సింగరేణి వ్యవహారంలో కథనాలన్నీ అవాస్తవం

Singareni | సింగరేణి వ్యవహారంలో కథనాలన్నీ అవాస్తవం
- కాంగ్రెస్ హయాంలో అవినీతికి నో ఛాన్స్
- ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
Singareni | గోదావరిఖని, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కల మధ్య గడిచిన కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు వస్తున్న కథనాలు, పుకార్లలో ఎలాంటి వాస్తవం లేదని… వారిద్దరి మధ్య విభేదాలు ఎంత మాత్రం లేవని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు స్పష్టంగా చెప్పారు. బుధవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులందరూ కలిసే పని చేస్తున్నారని… అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. కొద్దిరోజులుగా ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తుందని, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు …విమర్శలను శ్రీధర్ బాబు కొట్టిపారేశారు. సింగరేణిలో బొగ్గుస్కాం అంటూ….కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
సోషల్ మీడియా, కొన్ని సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని అసత్యపు ప్రచారం చేస్తున్నారని, వీటిని ఎవరు పట్టించుకోరు అన్నారు. సింగరేణి బొగ్గు పరిశ్రమకు సంబంధించి వస్తున్న కథనాలన్నీ కూడా పూర్తిగా అవాస్తవమని శ్రీధర్ బాబు తేల్చి చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న నలుగురు మంత్రులు కూర్చొని మాట్లాడుకుంటే కూడా తప్పుగా కథనాలను అల్లడం పై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైట్ విజిట్ అనేది గత ప్రభుత్వ హాయములోనే ఉందని పేర్కొన్నారు.
