• అమర జవాన్ మురళీ స్టోరీ
  • బిగ్ బాస్ ఫ్రెండ్ గౌతమ్ కృష్ణ టైటిల్ రోల్
  • పాన్ ఇండియా రేంజ్ లో నిర్మాత కే సురేష్ రెడీ
  • మురళి నాయక్ తల్లిదండ్రులు ఓకే

( ఆంధ్రప్రభ, శ్రీ సత్యసాయి బ్యూరో) : భారత్ – పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ (Operation Sindhur) లో నేలకొరిగిన అమరవీరుడు తెలుగు జవాన్ మురళీ నాయక్ (22) జీవిత కథను తెరకెక్కించేందుకు నిర్మాత కె సురేష్ బాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ (Bigg Boss fame Gautham Krishna) ఈ చిత్రంలో టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత కె.సురేశ్ బాబు తెలిపారు. ఈసందర్భంగా గౌతమ్ కృష్ణ పలు వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ మన దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక ముఖ్య అధ్యాయమన్నారు. దేశ ప్రజల కోసం వీరమరణం పొందిన మురళీ నాయక్ (Murali Nayak) కథను ఈ ప్రపంచానికి చెప్పాలని, అందరూ తెలుసుకోవాలని, ఈ చిత్రం తీస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అయితే, ఈ సినిమా నిర్మించేందుకు మురళీ నాయక్ తల్లిదండ్రుల అనుమతి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో మురళీ నాయక్ తల్లిదండ్రులు ముదావత్ శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai District) పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ నాయక్ ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద శత్రు సైనికులతో పోరాడి వీర మరణం పొందారు. మురళి నాయక్ అంత్యక్రియలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత, అదేవిధంగా జిల్లా ఇన్చార్జి మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, బీసీ మహిళా సంక్షేమ శాఖ చేనేత జౌలి శాఖ మంత్రి ఎస్ .సవిత స్వయంగా పాల్గొన్న విషయం తెలిసిందే.

అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy), పలువురు సినీ ప్రముఖులు, కేంద్ర మంత్రులు, వివిధ సామాజిక వేత్తలు, పెద్ద ఎత్తున తరలివచ్చి మురళి ఘాట్ గా వద్ద నివాళులు అర్పించడంతోపాటు మురళి నాయక్ తల్లిదండ్రులను పరామర్శించడం తెలిసిందే. ప్రభుత్వం తరఫున సుమారు కోటి రూపాయలు, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పాతిక లక్షలు ఇంకా పలువురు లక్షల రూపాయలు మురళి నాయక్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. శ్రీ సత్య సాయి జిల్లా (Sri Sathya Sai District) చరిత్రలో ఆపరేషన్ సింధూర్ ఘటన లో జవాన్ మురళి నాయక్ వీరమరణం పొందడం చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం. ఇలాంటి ఇతివృత్తాన్ని సినిమాగా తీయడంతో భవిష్యత్ తరాలకు వీర జవాన్ మురళి నాయక్ ఆదర్శంగా నిలిచిపోతుందని జనం అభిప్రాయం.

Leave a Reply