ఏసీబీ వలలో ములుగు ఎస్సై, కానిస్టేబుల్..

ములుగు, (ఆంధ్రప్రభ) : ములుగు పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై విజయ్‌కుమార్, కానిస్టేబుల్ రాజు లు ఏసీబీ వలలో చిక్కారు.

ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్‌రూమ్ ఇల్లుపై ఇతరులు అక్రమంగా కబ్జా చేసిన నేపథ్యంలో, బాధితులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు వారి పక్షాన ఆదేశాలు జారీ చేయగా, ఆ ఆర్డర్ కాపీని ములుగు ఎస్సై విజయ్‌కుమార్‌కు అందజేసి న్యాయం చేయమని కోరారు.

అయితే, ఆ ఇంటిని అప్పగించాలంటే రూ.1 లక్ష లంచం ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితులు ఆ మొత్తం ఇవ్వలేకపోవడంతో రూ.50,000కి ఒప్పుకుని, వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించారు.

ఏసీబీ ఏర్పాటు చేసిన ఉచ్చులో మంగళవారం సాయంత్రం కానిస్టేబుల్ రాజుకు రూ.50,000 లంచం అందజేస్తున్న సమయంలో అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, విచారణ అనంతరం రిమాండుకు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.

Leave a Reply