షోలే ఒక సంచలనం. 1975 ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమాకి రమేష్ సిప్పీ దర్శకత్వం వహించగా, సంభాషణ మాంత్రికులు సలీం–జావేద్ అద్భుతమైన మాటలతో చిరస్థాయిగా నిలిచేట్టుగా మలిచారు. జై–వీర్ స్నేహం, ధైర్యవంతుడైన ఠాకూర్, అల్లరి బసంతి, నిశ్శబ్ద రాధ… పాత్రలు ఒక ఎత్తైతే, క్రూరమైన గబ్బర్ సింగ్, పాత్ర మరీ ప్రత్యేకం. ప్రతి పాత్ర రూప కల్పన ఈ బ్లాక్‌బస్టర్ సినిమాను భారతీయ సినీ చరిత్రలో నిలిపేందుకు దోహదం చేసింది.
“జో డర్ గయా సమ్‌జో మర్ గయా”
“కిత్ నే ఆద్మీ థే? “
“అరే ఓ సాంబా,
కిత్నా ఇనామ్ రఖే హై సర్కార్ హమ్ పర్?”
డైలాగులు ఎప్పటికీ మర్చిపోలేరు షోలే అభిమానులు. 50 ఏళ్ల తర్వాత కూడా, ఇవి ఎక్కడోచోట వినిపిస్తూ, నిత్యనూతనంగా అనిపిస్తున్నాయి.
తెలుగు సినిమాలు కూడా ఈ క్లాసిక్‌లోని గొప్ప అంశాలను తమదైన శైలిలో ప్రదర్శించడానికి ప్రయత్నించాయి. 2009లో సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆర్య 2లో, జై–వీర్ స్నేహాన్ని గుర్తు చేసేలా ఒక ప్రత్యేక సీక్వెన్స్ రూపొందించారు.
హీరో అల్లు అర్జున్ – విలన్ అజయ్ మధ్య స్నేహ బంధాన్ని చూపించడానికి, షోలేలోని ప్రసిద్ధ గీతం “Yeh Dosti”ని తెలుగు వెర్షన్‌గా మ్యూజిక్‌లో మేళవించారు. ఆ పాటలోని ఉత్సాహం, ఆప్యాయత, స్నేహ భావం చూసినవారికి మళ్లీ షోలే మధుర జ్ఞాపకాలను తెచ్చింది.
ఇక మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఒక ప్రసిద్ధి చెందిన విలన్ పాత్ర పేరు, మేనరిజం, డైలాగుల ఆధారంగా ఒక హీరో పాత్రని మలచడం విశేషం. అదే 2012 లో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-శృతి హసన్ జంటగా రిలీజై సూపర్-డూపర్ హిట్ కొట్టిన గబ్బర్ సింగ్ మూవీ. ఇంత ప్రభావం చూపిన షోలే పేరు, ఆ సినిమా పాత్రలు.. తెలుగు సినిమాల్లోకీ చేరాయి. ఆ సినిమాలో పవన్ పాత్ర తనకే తానుగా “గబ్బర్ సింగ్” అని పరిచయం చేసుకునే సీన్లు, ‘‘అరే ఓ సాంబా’’అని అక్కడక్కడా పాత షోలే డైలాగులు.. ఇవన్నీ పాత క్లాసిక్‌కి ఒక వినోదభరితమైన ట్రిబ్యూట్‌లా నిలిచిపోయాయి.
ఇలా, పాటల రూపంలోనూ, డైలాగుల రూపంలోనూ, పాత్రల రూపంలోనూ షోలే ప్రభావం తెలుగు తెరపైనా చెరగని ముద్ర వేసింది.