అమరావతి : మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. కాకాణి ముందస్తు బెయిల్‌కు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. క్వార్ట్జ్ అక్రమాలు, భారీ ఎత్తున పేలుడు పదార్ధాల వినియోగం, అట్రాసిటీ కేసులో కాకాణి ఏ1గా ఉన్నారు. దాదాపు రెండు నెలలుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు.
ఈకేసుకు సంబంధించి గతంలోనూ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం కాకాణి పిటిషన్ వేయగా, అక్కడ కూడా నిరాశే ఎదురైంది. కాకాణికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయగా ఈరోజు (శుక్రవారం) విచారణకు వచ్చింది. కాకాణి తరఫున ప్రముఖ న్యాయవాది, మాజీ హైకోర్టు న్యాయమూర్తి దామా శేషాద్రి నాయుడు, అభినవ్ వాదనలు వినిపించారు. అయితే సుప్రీంకోర్టు కూడా కాకాణికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.