Sheikh Hasina | భగ్గుమన్న బంగ్లా..

Sheikh Hasina | భగ్గుమన్న బంగ్లా..
Sheikh Hasina, ఢాకా : బంగ్లాదేశ్ లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. మాజీ ప్రధాని షేక్ హసీనాకు (Sheikh Hasina) మరణశిక్ష విధిస్తూ ఐసీటీ కోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో అవామీలీగ్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో దేశవ్యాప్తంగా మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ అల్లర్లలో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఢాకా సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఐసీటీ తీర్పునకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిస్తూ రెండు రోజులు పాటు బంద్ ప్రకటించినట్టు అవామీలీగ్ ప్రకటించింది. దీంతో యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించింది.
షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ (Mujibur Rohman) నివాసమున్న ధన్మొండి – 32 సహా పలు ప్రాంతాల్లో హసీనా మద్దతుదారులు రహదారులను దిగ్బంధించి, ఇతర నివాసాలు, దుకాణాల పైకి రాళ్లు రువ్వారు. దీంతో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు సౌండ్ గ్రనేడ్లు, టియర్ గ్యాస్ ను ప్రయోగించాల్సి వచ్చింది. పోలీసులు లాఠీ ఛార్జీకి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మీడియాకు సర్కార్ వార్నింగ్..
తనకు మరణశిక్ష విధించడాన్ని ఖండిస్తూ షేక్ హసీనా విడుదల చేసిన ప్రకటనను ప్రచురించవద్దని మీడియాను బంగ్లాదేశ్ (Bangladesh) తాత్కాలిక ప్రభుత్వం హెచ్చరించింది. దోషిగా తేలి పరారీలో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసానా జారీ చేసిన ప్రకటనలను నివేధించకుండా ఉండాలని అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్, ఆన్ లైన్ మీడియా సంస్థలకు సూచించింది. హసీనా ప్రకటనలో హింస, నేర కార్యకలాపాలను ప్రేరేపించిన సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే ఆదేశాలు ఉండవచ్చని నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఓ ప్రతికా ప్రకటన రిలీజ్ చేసింది. ఈ క్రమంలో జాతీయ భద్రత దృష్ట్యా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీడియాను కోరుతున్నట్లు తెలిపింది.
మరి కొన్ని వార్తలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
https://epaper.prabhanews.com
