శబరిమల పాదయాత్ర పూర్తిచేసి సంగారెడ్డి చేరుకున్న అయ్యప్పలు
SHABARI | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : అక్టోబర్ 6న సంగారెడ్డి నుంచి తిరుపతి, కాణిపాకం, అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము గురు స్వామి, వారి శిష్య బృందం సుమారు 1600 కిలోమీటర్లు యాత్ర విజయవంతం చేసుకుని శుక్రవారం సాయంత్రం సంగారెడ్డి తిరిగి చేరుకున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో వారికి ఘన స్వాగతం లభించింది. సంగారెడ్డి అయ్యప్ప స్వాములు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వారికి పాదాలు కడిగి, హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణు ఆధ్వర్యంలో పాదయాత్ర స్వాములను ఘనంగా సన్మానించారు. సంగారెడ్డి సండే మార్కెట్ వద్ద గల అభయాంజనేయ స్వామి దేవాలయం నుండి నవరత్నాలయ దేవస్థానం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
నవరత్నాలయ దేవస్థానం వద్ద సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి సత్కారం మెమెంటో అందజేశారు. కూన వేణు మాట్లాడుతూ పాదయాత్ర అనేది జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చేయాలని, పాదయాత్ర అనేది అతి కష్టమైన యాత్ర అని అలా మూడుసార్లు వెళ్లిన రాము స్వామి ఆధ్వర్యంలోని పాదయాత్ర బృందం సంగారెడ్డికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చారని ఆయన అన్నారు. అయ్యప్ప ఆపద్బాంధవ సేవ సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర బృందానికి స్వాగతం పలికివారికి అభినందనలు తెలియజేశారు. సాహితీ రాము స్వామి మాట్లాడుతూ పాదయాత్ర ఐదు సార్లు చేయడం మా లక్ష్యం అని ఇప్పటివరకు మూడుసార్లు విజయవంతంగా పూర్తి చేశామని సంగారెడ్డి గురుస్వాములు మాత స్వాముల దీవెనలతో సాధ్యమైందని అలాగే మా పాదయాత్ర బృందం పూర్తిగా సహకరించి పాదయాత్ర విజయవంతం కావడానికి చాలా కష్టపడ్డారని తెలిపారు. నవంబర్ 30న రాము స్వామి 18వ మహా పడిపూజ ఉందని, ప్రతి ఒక్కరూ పూజకు హాజరై తమ ఆశీర్వాదాలు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కూన వేణు అయ్యప్ప ఆపద్బాంధవ సేవా సమితి సభ్యులు, సంగారెడ్డి గురు స్వాములు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

