ఏడు లక్షల లంచం.. ఏడు కోట్ల భూమి హంఫట్
- అదిలాబాద్ పట్టణంలో డబుల్ రిజిస్ట్రేషన్..
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్‌లో కాసులిస్తే ఎలాంటి భూమి నైనా రిజిస్ట్రేషన్(Registration) చేయించడంలో సిద్ధహస్తులు సబ్ రిజిస్ట్రార్ అధికారులు. కోట్లాది రూపాయల విలువైన సర్కారు(Govt) భూములను సైతం అప్పనంగా రియల్ ఎస్టేట్(Real Estate) వ్యాపారులకు కట్టబెట్టి గతంలో కటకటాల పాలైన చరిత్ర వీరిది.
తాజాగా లంచాలకు కక్కుర్తిపడిన ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఓ పట్టా భూమిని రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేశాడు. ఓ ఖాళీ ప్లాటుకు లక్ష చొప్పున తీసుకుని కోట్ల విలువైన భూమిని రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు.
బాగోతం బయట పడిందిలా…
ఈ ఘటనలో అక్రమంగా భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ అశోక్(Sub-Registrar Ashok) పై జిల్లా పోలీసులు కేసు నమోదు చేయడంతో అక్రమాల భూ బాగోతం బయటపడింది. రూ. 7 కోట్ల విలువైన భూమిని రెండుసార్లు రిజిస్ట్రేషన్ చేయగా ఇందులో ప్రధాన నిందితుడు వైద్య శాఖ ఉద్యోగి బీ. సంజీవ్ నుండి సబ్ రిజిస్ట్రార్ రూ. 7 లక్షల లంచం తీసుకున్నట్టు బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అక్రమంగా డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన ముఠా వ్యవహారంపై బాధితుడు కే. మిలింద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహజన్, డీ.ఎస్.పీ జీవన్ రెడ్డి( DSP Jeevan Reddy) ల్యాండ్ మాఫియా ముఠా రాకెట్ను బట్టబయలు చేశారు. వీరిపై అనేక కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.
డబుల్ రిజిస్ట్రేషన్…
డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకొని అవినీతి అక్రమాలకు పాల్పడిన ఈ కేసులో ఆర్డబ్ల్యుఎస్ డీఈఈ వెంకటరమణ, మాజీ కౌన్సిలర్ రఘుపతి, రిమ్స్ ఉద్యోగి, రియల్ ఎస్టేట్ వ్యాపారి బెజ్జవార్ సంజీవ్ కుమార్ ను పోలీసులు(పోలీసులు ) అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్నసబ్ రిజిస్ట్రార్ అశోక్ కోసం గాలిస్తున్నామని, అదిలాబాదులో డబుల్ రిజిస్ట్రేషన్(Double Registration) కేసులు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ అధికారుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని డీఎస్పీ జీవన్ రెడ్డి(DSP Jeevan Reddy), మావల సీఐ కర్రేస్వామి తెలిపారు.
ఆదిలాబాద్ పట్టణంలో రూ. ఏడు లక్షల లంచం తీసుకొని రూ. ఏడు కోట్ల భూమిని అప్పనంగా కట్టబెట్టిన సబ్ రిజిస్టర్ అశోక్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
