ఉద్యమ్, పీఎంఈజీపీపై అవగాహన సదస్సు…

ఉద్యమ్, పీఎంఈజీపీపై అవగాహన సదస్సు…
జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్‌ఫార్మెన్స్ (ర్యాంప్) కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో జగ్గయ్యపేట మెప్మా కార్యాలయంలో బుధవారం ఉద్యమ్, పీఎంఈజీపీ పథకంపై ప్రత్యేక అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి 105 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, చిరు వ్యాపారులు హాజరయ్యారు. ఉద్యమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు.
కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద తయారీ రంగానికి రూ. 50 లక్షలు, సేవా రంగానికి రూ. 20 లక్షలు వరకు రుణాలు లభిస్తాయని పారిశ్రామిక ప్రోత్సాహక అధికారి ఎన్‌వీ సత్యనారాయణ వివరించారు. ముఖ్యంగా మహిళలు, ప్రత్యేక వర్గాల వారికి గ్రామీణ ప్రాంతాల్లో 35 శాతం వరకు రాయితీ వర్తిస్తుందన్నారు. అదేవిధంగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వల్ల బ్యాంకుల నుంచి పూచీకత్తు లేని రుణాలు పొందేందుకు వకాశముంటుందని మెప్మా పీడీ మురళీకృష్ణ ప్రసాద్ వివరించారు.
మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలన్నారు. స్వయం ఉపాధి ద్వారా పారిశ్రామిక యూనిట్లు నెలకొల్పి తమతో పాటు మరో పదిమందికి ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వచ్చే సంతృప్తి వెలకట్టలేనిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు షేక్ నాజిమూన్, మెప్మా అధికారులు సుధారాణి, ఎ.సుగుణ, సీవోలు ఎ.వెంకట్, జె.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
