మానవ జీవితంలో సైన్స్ ఒక భాగం

మానవ జీవితంలో సైన్స్ ఒక భాగం

శావల్యాపురం, నవంబర్ 4, ఆంధ్రప్రభ : మానవ జీవితంలోని ప్రతి అంశంలోనూ సైన్స్ ఒక భాగమని జనవిజ్ఞాన వేదిక మండల కమిటీ గౌరవ అధ్యక్షుడు కెవిఆర్ మోహన్ చంద్ (KVR Mohan Chand) అన్నారు. మూఢనమ్మకాల నిర్మూలనకు విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని, శాస్త్రవేత్తలుగా ఎదిగి సమాజాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కె. లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరుగుతున్న చెకుముకి సైన్స్ సంబరాల మండల స్థాయి పోటీలను శావల్యాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించారు.

ఈ చెకుముకి సైన్స్ సంబరాల్లో వేల్పూరు, పొట్లూరు, మతుకుమల్లి, శావల్యాపురం జడ్పీ పాఠశాల విద్యార్థులు పోటీ పడగా వేల్పూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు చెన్నా లోహిత, గోరంట్ల గాయత్రి, జూపల్లి విష్ణువర్ధన్ ప్రథమ స్థానం సాధించారు. వీరు జిల్లాస్థాయి చెకుముకి సంబరాల్లో మండలం తరపున పాల్గొంటారని కమిటీ గౌరవ అధ్యక్షుడు కెవిఆర్ తెలిపారు. ఈ సందర్భంగా శావల్యపురం హెచ్ఎం బొడ్డపాటి విజయలక్ష్మి (Vijayalakshmi) మాట్లాడుతూ… సైన్స్ కేవలం పుస్తకాలలోనే కాదు, మన దైనందిన జీవితంలోనూ ప్రతీచోట ఉందని పేర్కొన్నారు.

యు.టి.ఎఫ్ మండల శాఖ ప్రధాన కార్యదర్శి జి.ప్రసాద్ మాట్లాడుతూ… విద్యార్థులు ప్రకృతిని కాపాడుకోవాలని, భవిష్యత్ తరాలకు (future generations) ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించాలని అవగాహన కల్పించారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక మండల కమిటీ అధ్యక్షులు అరవీటి వసంతరావు, ప్రధాన కార్యదర్శి బోయపాటి త్రివిక్రమ్, సభ్యులు జ్యోతి శ్రీనివాసరావు, పసుమర్తి సురేష్, ఎలిక శ్రీనివాసరావు, కొత్త జగన్మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు కిరణ్మయి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply