మోత్కూర్ తొలి మహిళా చైర్మన్‌గా సావిత్రి

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ నూతన మున్సిపాలిటీకి తొలి చైర్మన్‌గా, అలాగే తొలి మహిళా చైర్మన్‌గా పనిచేసిన తీపిరెడ్డి సావిత్రి తన నాలుగేళ్ల పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ఆంధ్రప్రభ ప్రతినిధితో మాట్లాడారు.
తనకు రాజకీయ అనుభవం లేకపోయినా, ఇంటి వ్యవహారాలకే పరిమితమైన జీవితంలో నుంచి బయటకు వచ్చి మున్సిపల్ చైర్మన్‌గా పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. తన భర్త మాజీ మార్కెట్ చైర్మన్ మేఘారెడ్డి ప్రోత్సాహం, మాజీ ఎమ్మెల్యే గాధరి కిశోర్ కుమార్ మార్గదర్శకంతో ఆరు పదుల వయస్సులో ఈ బాధ్యతలు చేపట్టానని చెప్పారు.
ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోయినా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి తరచూ పర్యటించానని, మున్సిపల్ సమావేశాలకు కూడా క్రమం తప్పకుండా హాజరయ్యానని తెలిపారు. చివరి ఏడాదిలో అవిశ్వాస తీర్మానం బాధ కలిగించినప్పటికీ, నాలుగేళ్ల పాటు ప్రజలకు సేవ చేయగలిగానన్న సంతృప్తి తనకు రాజకీయ ధైర్యాన్ని ఇచ్చిందన్నారు.
యువతులు, మహిళలు రాజకీయాల్లోకి ముందుకు వచ్చి ప్రజలకు పారదర్శకమైన పాలన అందించాలని ఆమె ఆకాంక్షించారు. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
