Sathya sai | అంతా సాయి మయం..

Sathya sai | అంతా సాయి మయం..

Sathya sai, శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ బ్యూరో: భగవాన్ శ్రీ సత్య సాయి బాబా (Sathya Sai baba) శత జయంతి వేడుకలు పుట్టపర్తిలో ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే దేశ విదేశాల నుండి బాబా భక్తులు పెద్ద సంఖ్యలో పుట్టపర్తి చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు మంగళవారం పుట్టపర్తి విమానాశ్రయంలో దిగారు. వీరికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మె ల్యేలు ఘన స్వాగతం పలికారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం పుట్టపర్తి చేరుకుని బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు. దేశ విదేశాల నుండి విచ్చేసిన బాబా భక్తుల నోటా సాయిరాం.. సాయిరాం అనే మాట మార్మోగిపోతోంది. సత్య సాయి బాబా బోధనలను బాబా భక్తులు గుర్తుచేసుకుంటున్నారు.

ఆదర్శం.. ఆచరణీయం సత్యసాయి సందేశం..
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా తన ప్రసంగాలతో అసంఖ్యాక ప్రజానీకానికి స్పూర్తి కలిగించేవారు. ఒక సందర్భంలో ప్రేమ స్వరూపులారా! మీరంతా పరమాత్మ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆధ్యా త్మికతను అలవరచుకోవాలి. ఎంత క్లిష్ట పరిస్థితి ఎదురైనా సరే.. సత్యాన్నే పలుకుతూ.. ధర్మంగా నడుచుకోవాలి. ప్రశాంత చిత్తాన్ని అలవరచుకొని, అందరి పట్ల ప్రేమభావంతో మెలగాలి. అప్పుడే మనశ్శాంతి, అటు పిమ్మట విశ్వశాంతి లభిస్తాయి. ఆధ్యాత్మిక పురోగతికి స్వార్థం పెద్ద అవరోధం. నిస్వార్థ చింతన ఔన్నత్యానికి సూచన. శాశ్వతం కాని ఈ దేహంపై మోహం ఎందుకు? అహం వదిలి, కర్త వ్యాన్ని నెరవేర్చుకోవాలి. ఆకలి గొన్నవారికి అన్నం పెట్టాలి. పెద్దలను మన్నించాలి. తల్లిదండ్రులను పూజించాలి. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమలతో ముందుకు సాగుతూ మహనీయులుగా ఎదగాలి. భగవంతుడు అందరినీ గమనిస్తుంటాడని గుర్తుంచుకోవాలి అంటూ దివ్య సందేశం అందించారు అప్పట్లో సత్యసాయిబాబా.

ఆ ఏనుగంటే బాబాకి ఎంతో ఇష్టం..
సత్య సాయి బాబాకు (Sathya sai baba) ఎంతో ఇష్టమైన ఓ ఏనుగు చనిపోవడంతో దానికి ఏకంగా ఆలయాన్నే నిర్మించారు. ఈ గజరాజు ఆలయం పుట్టపర్తిలో నక్షత్రశాల పక్కనే ఉంది. ఈ ఆలయ నేపథ్యాన్ని పరిశీలిస్తే సత్య సాయి బాబా సకల జీవుల పట్ల చూపిన అంతులేని ప్రేమ గుర్తుకు వస్తుంది. సత్యసాయిబాబా 1962లో తమిళనాడులోని బండిపూర అడవి నుంచి ఓ గున్న ఏనుగును కొనుగోలు చేసి పుట్టపర్తికి తీసుకొచ్చారు. దానికి సాయిగీత అని పేరు పెట్టి.. ప్రేమతో పెంచుకుంటుండేవారు. ప్రశాంతి నిలయంలో జరిగే ప్రతి కార్య క్రమంలోనూ, పండుగల్లోనూ, ఊరేగింపుల్లోనూ బాబా ముందర సాయిగీత నడుస్తూ ఉండేది. దాని కోసం ప్రత్యేకంగా మావటీలను ఏర్పాటు చేసి, చిన్న షెడ్డులో ఉంచి సంరక్షించేవారు. ప్రతి రోజూ మావటీలు ఏనుగును వాకింగ్ కు తీసుకెళ్లేవారు. వయసు మీదపడడంతో 2007 మే 23న సాయిగీత చనిపోయింది. ఆత్మ బంధువుల అంత్యక్రియలకు సైతం వెళ్లని సత్యసాయి ఆరోజు సాయిగీత అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక నక్షత్ర శాల పక్కనే దాన్ని సమాధి చేశారు. 10వ రోజున వైకుంఠ సమారాధన సైతం ఘనంగా నిర్వహించారు. అక్కడే ఓ ఆలయాన్ని నిర్మించారు. అనంతరం మరో గున్న ఏనుగును అప్పటి టీటీడీ చైర్మన్ ఆదికేశవుల నాయుడు సత్యసాయికి బహూకరించారు. అది అనారోగ్యంతో 2013లో మృతి చెందింది. దాన్ని సైతం సాయిగీత పక్కనే ఖననం చేశారు.

మరి కొన్ని వార్తలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

https://epaper.prabhanews.com

Leave a Reply