Sathenapalli | మహాశివరాత్రికి.. ముస్తాబవుతున్న “వడ్డవల్లి విద్యుత్ ప్రభ”…!!

Sathenapalli | మహాశివరాత్రికి.. ముస్తాబవుతున్న “వడ్డవల్లి విద్యుత్ ప్రభ”…!!
గత 155 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఆనవాయితీ…!!
ఆలయం వద్ద “పూజలు” కొండ లో “భోజనాలు”…!!
Sathenapalli | పల్నాడు ,ఆంధ్రప్రభ: దక్షిణ కైలాసంగా పేరొందిన త్రికోటేశ్వర స్వామి వారి ఆలయం వద్దకు తరలి వెళ్లేందుకు “వడ్డవల్లి విద్యుత్తు ప్రభ” ముస్తాబవుతుంది. కోటప్పకొండ మహా శివరాత్రి తిరునాళ్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి ప్రభులేనని నానుడి. వీటిని వీక్షించేందుకు లక్షలాదిమంది భక్తులు అక్కడికి చేరుకుంటారు. ఇక వడ్డవల్లి విద్యుత్ ప్రభ చరిత్రను పరిశీలిస్తే. పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పురపాలక సంఘం పరిధిలోని వడ్డవల్లి గ్రామానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ గ్రామ ప్రజలకు మహాశివరాత్రి రోజున కోటయ్యకొండకు తరలి వెళ్లడం ఒక ఆనవాయితీ అయితే… ప్రతి శివరాత్రికి ప్రత్యేకంగా “విద్యుత్ ప్రభ”ను నిర్మించి కొండ కు తరలించటం ఇక్కడ ప్రజల యొక్క విశిష్టతగా చెప్పవచ్చు. కులమతాలకు అతీతంగా ఈ ప్రబను నిర్మించేందుకు వడ్డవల్లి ప్రాంతంలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు ముందుకు రావడం విశేషం. ఖర్చుకు వెనకాడకుండా… ఆనవాయితీ తప్పకుండా… ప్రభను నిర్మించుకొని, కొండకు తరలించుకోవడం…. కొండలో వేలాది మంది భక్తులకు అన్నదానం చేయడం ఈ వడ్డవల్లి గ్రామ ప్రజల యొక్క ప్రత్యేకతగా పేర్కొనవచ్చు.
ఈ గ్రామంలో 1871 వ సంవత్సరంలో “ప్రభ”ను నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. అంటే దాదాపు 155 సంవత్సరాల నుంచి కోటప్పకొండకు విద్యుత్ ప్రభను నిర్మించుకొని స్థానికులు తరలి వెళ్లడం ఇక్కడ విశేషం. ఈ ఏడాది 36 అడుగుల ఎత్తులో ప్రభను నిర్మిస్తున్నారు. సుమారు 200 మంది కార్యకర్తలు ఈ ప్రభను కొండకు తరలించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈనెల 13వ తేదీ వడ్డవల్లి ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, కోలాట ప్రదర్శన, ప్రభ అలంకరణ తదితర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటామని చెబుతున్నారు. 14వ తేదీ సాయంత్రం బయలుదేరి, 15వ తేదీ మధ్యాహ్నం కల్లా కొండ ప్రాంతానికి చేరుకుంటామని నిర్వాహకులు పేర్కొన్నారు. గత 40 సంవత్సరాల క్రితం ప్రభను నిర్మించేందుకు 40 నుంచి 50 వేల రూపాయలు ఖర్చు చేశామని, అదే ఈ రోజున నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
రాతి చక్రాలతో కూడిన ఎడ్ల బండి పై ప్రభను తరలించటం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా కొండకు ప్రభను తరలించేందుకు రాతి చక్రాల ఎడ్ల బండిని సిద్ధం చేశారు. దీనిని కొండకు తరలించేందుకు రైతులు లాటరీ ద్వారా తమ ఎడ్లను ఏర్పాటు చేయటం విశేషం. దాదాపు 25 మంది రైతులు ఈ లాటరీలో పాల్గొని, తమ జత ఎడ్లను బండికి కట్టుకొని ప్రభను లాక్కుని వెళ్లడం ఆనవాయితీగా వస్తుందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. మొత్తం మీద వడ్డవల్లి ప్రభకు ఉన్న ఈ చరిత్ర మరే ప్రభకు కూడా లేదని చెప్పాలి. 15వ తేదీన కొండ ప్రాంతంలో తమ ప్రభ వద్ద దాదాపు పదివేల మందికి అన్నదాన కార్యక్రమం జరిపిస్తామని నిర్వాహకులు తెలిపారు.

