ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కొందరు దేశ భక్తిని చాటుకునే విధానం చూస్తే సలామ్ కొట్టాలనిపిస్తుంది. ఝార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు (Govt holiday for schools) ప్రకటించింది. అయితే, శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వరద నీటిలోనే పలు పాఠశాలల్లో వేడుకలు నిర్వహించారు. నడుములోతు నీటిలో ఉపాధ్యాయులు, స్థానికులు, విద్యార్థులు (students) జెండా వందనం చేశారు. జిల్లాలోని దియారా ప్రాంత పాఠశాలల్లో జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్ గా మారాయి. సదర్ బ్లాకు పరిధిలోని కిషన్ ప్రసాద్ పంచాయతీ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఛాతీ లోతు నీటిలో నిలబడి జెండా ఎగురవేసి.. జాతీయగీతం (national anthem) ఆలపించారు. ఖోక్లాసింగ్ టొలా రాంపుర్‌లో ఉపాధ్యాయుల సాయంతో విద్యార్థులు పడవలో స్కూలుకు వెళ్లి జెండా వందనం చేశారు. కాగా, బీహార్ లోని షేఖ్ పురాలోనూ పలువురు స్థానికులు వరద నీటిలోనే పతాకావిష్కరణ చేసి జాతీయగీతాలాపన చేశారు.
మీ దేశభక్తికి వందనం
