కదిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు నూతన రూపు…

కదిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు నూతన రూపు…

జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చేతుల మీదుగా పునఃప్రారంభం..

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఉదయం జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చేతుల మీదుగా ఘనంగా పునఃప్రారంభించారు. సిఎస్ఆర్ ఫండింగ్, పోలీస్ వెల్ఫేర్ ఫండ్, ఎమ్మెల్యే సహకారం, దాతల విరాళాలతో దాదాపు రూ.25 లక్షలు వెచ్చించి స్టేషన్‌ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. పునఃప్రారంభోత్సవం సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, గతంలో చిన్న గదుల్లో నిర్వహణ సాగిన ఈ స్టేషన్ ఇప్పుడు విశాలంగా, ప్రజలకు అనుకూలంగా మారడం సంతోషకరమన్నారు.

ఈ స్టేషన్ పరిధిలో 13 పంచాయతీలు, 75 గ్రామాలు ఉండటంతో ప్రజలు నిత్యం వివిధ అవసరాల కోసం ఇక్కడికి వస్తుంటారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలతో స్టేషన్‌ను పునరుద్ధరించామని తెలిపారు. ప్రజలకు నిత్యం పోలీసులు అందుబాటులో ఉండి వారి సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రధాన లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు. నూతన పోలీస్ స్టేషన్ మాదిరిగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన ఎస్డిపిఓ శివ నారాయణస్వామి, సిఐ నిరంజన్ రెడ్డి, సహకరించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌తో పాటు పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.

ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీగా సతీష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలీస్ శాఖలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని, సిబ్బంది నూతన ఉత్సాహంతో పని చేస్తున్నారని కొనియాడారు. పోలీసులకు మానసిక ప్రశాంతత ఎంతో అవసరమని, ఆ దిశగా శాఖలో మంచి మార్పులు తీసుకువస్తున్న నాయకత్వం ఎస్పీదేనని ప్రశంసించారు. ఈ సందర్భంగా కదిరి పోలీస్ సబ్‌డివిజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కూడా ఎస్పీ, ఎమ్మెల్యే ప్రారంభించారు.

అనంతరం స్టేషన్ నిర్మాణాన్ని ముందుండి నడిపించిన డీఎస్పీ శివ నారాయణస్వామి, సిఐ నిరంజన్ రెడ్డితో పాటు పోలీస్ సిబ్బందిని సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శర్మ, సిఐలు నారాయణరెడ్డి, నాగేంద్ర, సబ్‌డివిజన్ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.
“ప్రజలకు మరింత చేరువగా… సేవల్లో మరింత వేగంగా” అనే లక్ష్యంతో కదిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు నూతన రూపు తీసుకువచ్చారు.

Leave a Reply