ప్రయాణీలకు ఆర్టీసీ పలు సూచనలు, జాగ్రత్తలు
వెబ్ డెస్క్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకే గాక, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు కూడా ప్రధాన కేంద్రమైన హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ ప్రస్తుతం జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో వరద పెరిగి మూసీకి ప్రవాహం ఉధృతి పెరగి, జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ఎంజీబీఎస్ బస్టాండ్‌కు వెళ్లే రెండు బ్రిడ్జిలు నీట మునిగాయి. అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను సురక్షితంగా బయటకుతెచ్చారు. ఎంజీబీఎస్ బస్టాండ్‌కు వచ్చే బస్సులను మళ్లించారు. పలు బస్సులకు జేబీఎస్ వరకే అనుమతి ఇచ్చారు. ఎంజీబీఎస్ దగ్గర ఒకవైపు రోడ్డు మొత్తం మూసివేసారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. అందులో ప్రయాణికులకు పలు సూచనలు చేశారు.
ప్రయాణికులకు ముఖ్య గమనిక…
మూసీ నదికి భారీ వరద నేపథ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎంబీజీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోంది. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే సర్వీసులు జేబీఎస్ నుంచి నడుస్తున్నాయి. వరంగల్, హన్మకొండ వైపునకు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్తున్నాయి. సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపునకు బస్సులు ఎల్బీనగర్ నుంచి నడుస్తున్నాయి. మహబూబ్ నగర్, కర్నూల్, బెంగళూరు వైపునకు వెళ్లే సర్వీసులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నాయి. మూసీ వరదనీరు చేరిన నేపథ్యంలో ఎంజీబీఎస్ కు ప్రయాణికులు ఎవరూ రావొద్దని టీజీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేస్తోంది. ఎంబీజీఎస్ నుంచి నడిచే బస్సులను ఇతర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామని, ఆయా మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పేర్కొంది.
వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033