Rs.4,498 crore | అసెంబ్లీలో యార్లగడ్డ వెంకట్రావ్ ప్రసంగం…

Rs.4,498 crore | అసెంబ్లీలో యార్లగడ్డ వెంకట్రావ్ ప్రసంగం…
Rs.4,498 crore | గన్నవరం – ఆంధ్రప్రభ : అసెంబ్లీలో రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్ అసెంబ్లీలో కీలక ప్రసంగం చేశారు. గవర్నర్ ప్రసంగం కేవలం ఒక ప్రకటన కాదని, అది ‘విజన్ 2047’ దిశగా రాష్ట్రం సాగాల్సిన స్పష్టమైన మార్గదర్శకమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో నెలకొన్న అంధకారం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తూ, కేవలం 20 నెలల్లోనే రూ.4,498 కోట్ల విద్యుత్ బకాయిలను చెల్లించడంతో పాటు విద్యుత్ ఛార్జీలను తగ్గించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రానికి 13.25 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 16 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా అడుగులు పడుతున్నాయని వివరించారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి వంటి మూడు ప్రధాన అభివృద్ధి కారిడార్ల ద్వారా రాష్ట్ర ప్రగతిని పరుగులు తీయిస్తున్నామని, అమరావతిని శాశ్వత రాజధానిగా పునరుద్ధరించడమే కాకుండా పోలవరం పనులను వేగవంతం చేశామని గుర్తుచేశారు. పారిశ్రామిక రంగంలో 8.74 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని, అలాగే ప్రతి నియోజకవర్గంలో MSME పార్కుల ఏర్పాటు జరుగుతోందని తెలిపారు.
మెగా డీఎస్సీ ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, క్వాంటం వ్యాలీ, AI మరియు డ్రోన్ స్కిల్ సెంటర్ల ఏర్పాటు భవిష్యత్తు అవసరాలకు నిదర్శనమని వెంకట్రావ్ కొనియాడారు. గతంలో వివాదాస్పదమైన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భరోసా కల్పించామని, శాంతిభద్రతల పరిరక్షణ ద్వారా పెట్టుబడిదారులలో నమ్మకాన్ని పెంచామని ఆయన చెప్పారు. మొత్తానికి ఈ ప్రభుత్వం సంక్షేమంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టిస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఆయన తన ప్రసంగంలో స్పష్టం చేశారు.
గత ఐదేళ్ల పాలనలోని అనిశ్చితికి తెరదించుతూ, ప్రస్తుత ప్రభుత్వం స్థిరత్వం మరియు అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తోందని గత ప్రభుత్వ హయాంలో ఆడంబరపు ప్రకటనలు తప్ప, ఆచరణలో లోపాలు స్పష్టంగా కనిపించేవని విమర్శించారు. ముఖ్యంగా ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందక ఇబ్బంది పడటం, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి ఉపాధ్యాయులను బోధనేతర పనులకు పరిమితం చేయడం వంటి చర్యలు రాష్ట్ర ప్రగతిని కుంటుపరిచాయని మండిపడ్డారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 18 మెడికల్ కాలేజీలు నిధుల కొరతతో మధ్యలోనే నిలిచిపోగా, అభివృద్ధి పనుల కంటే సలహాదారుల వ్యవస్థకే వందల కోట్లు ఖర్చు చేయడం విమర్శలకు దారితీసిందని ఎద్దేవా చేశారు.
ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో జరిగిన జాప్యం వల్ల ప్రాజెక్టు వ్యయం రెట్టింపు అయ్యే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఆలస్యమైతే అయ్యే నష్టాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తించకపోవడం రాష్ట్రానికి తీరని లోటుగా మారిందన్నారు. అయితే, నేడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ప్రభుత్వ నిర్ణయాల్లో స్పష్టత, అమలులో వేగం కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ప్రజల అవసరాలకు తగ్గట్లుగా అభివృద్ధి, ఉపాధి కల్పన మరియు బాధ్యతాయుతమైన పాలనను అందిస్తూ ప్రజల్లో కోల్పోయిన నమ్మకాన్ని ఈ ప్రభుత్వం తిరిగి సంపాదిస్తోందన్నారు. ప్రస్తుత బడ్జెట్ సైతం ఇదే అభివృద్ధి దిశగా రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోందని ఎమ్మెల్యే యార్లగడ్డ పేర్కొన్నారు.
