ప్రతీ కార్యకర్తకూ టీడీపీ అండ…

ప్రతీ కార్యకర్తకూ టీడీపీ అండ…
- బాధిత కుటుంబానికి రూ.2 లక్షల చెక్కు అందజేత
- ప్రజాదర్భార్ నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ : ప్రతి కార్యకర్తకూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి పెద్ద పొందర వీధిలో కొన్నేళ్ల క్రితం తమ నివాస ఇంటి పైనుంచి జారిపడి మృతి చెందిన నాయుడు గారి శాంతారావు భార్య లక్ష్మికి పార్టీ తరఫున మంజూరైన రూ. 2 లక్షల చెక్కును మంత్రి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో కోటబొమ్మాలి, సంతబొమ్మాలి మండలాలకు చెందిన పలువురి నుంచి వినతులు స్వీకరించారు.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని అచ్చెన్నాయుడు తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని అన్నారు. తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ కాలంలో మంజూరైన గృహ నిర్మాణాలు మధ్యలో ఆగిపోయిన విషయంపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
ఆగిపోయిన ఇళ్ల పనులను మళ్లీ ప్రారంభించి పూర్తి చేస్తే, సంబంధిత బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తుందని మంత్రి లబ్ధిదారులకు వివరించారు. ప్రభుత్వం నుంచి త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలు వస్తాయని లబ్ధిదారులకు మంత్రి హామీ ఇచ్చారు. కొత్త పింఛన్లు త్వరలోనే మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు.
