Rs.1180 cr | ఎన్జీజీవో హోమ్ నిర్మాణాన్ని పూర్తిచేస్తాం…

Rs.1180 cr | ఎన్జీజీవో హోమ్ నిర్మాణాన్ని పూర్తిచేస్తాం…
Rs.1180 cr | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం ఎన్జీజీవో హోమ్ నిర్మాణాన్ని పూర్తిచేసి, వీలైనంత త్వరగా ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తామని.. ఈ విషయంలో మంత్రి కొల్లు రవీంద్ర సహకారం కోరడం జరిగిందని ఏపీ ఎన్జీజీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ అన్నారు. ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ఆధ్వర్యంలో జిల్లా ఎన్జీజీవో నాయకులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
ప్రతి విషయాన్ని సావధానంగా విన్న మంత్రి ఉద్యోగులు ప్రభుత్వం పట్ల ఎంతో సానుకూలంగా ఉన్నారని, ఉద్యోగులకు సంబంధించిన ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఎన్ జి ఓ హోమ్ నిర్మాణం పూర్తి చేయడం ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి తెలిపారు. అంతకు ముందు మచిలీపట్నంలోని ఎన్జీవో హోం ఖాళీ స్థలాలను పరిశీలించి స్థానిక నాయకులతో విద్యాసాగర్ చర్చించారు.

భవనాన్ని పూర్తిచేసేందుకు కృషిచేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన వివిధ సమస్యలపై ఉద్యోగులు విద్యాసాగర్‌కు వినతి పత్రాలు అందజేయగా.. వాటిని పరిశీలించి పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. గత ఆరేళ్లుగా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నీ పేరుకుపోయాయని, ఏడాది కాలంగా ఒక్కో సమస్యనూ పరిష్కారం చేసుకుంటూ వస్తున్నామని, దాదాపు 14 వేల కోట్ల రూపాయల బకాయిలను ఈ ప్రభుత్వంలో చెల్లించేట్లు చేసుకున్నామన్నారు.
సంక్రాంతికి కూడా రూ. 1180 కోట్ల డిఎ, డిఆర్ ఎరియర్స్ ను ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ కి చెల్లించేటట్లు చూడగలిగామని తెలిపారు. వేతన సవరణ కమిటీ చైర్మన్ ని నియమింప చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా విద్యాసాగర్ అన్నారు. జిల్లా సంఘ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ నిర్దేశించిన షెడ్యూల్‌లోపే భవాన్ని పూర్తిచేస్తామని, వారిచ్చిన స్ఫూర్తితో వివిధ సంఘాల సంఘ సభ్యుల, తాలూకా సభ్యుల సహకారంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉండేటట్లు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా సంఘ భవనాలకు విరాళాలు ప్రకటించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే బిల్డింగ్ కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర కార్యాచరణతో ముందుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్జీజీవో రాష్ట్ర కార్యదర్శి రజనీష్ బాబు, కృష్ణాజిల్లా ఎన్జీజీవో సంఘ కార్యదర్శి సీతారామయ్య, కార్యవర్గ సభ్యులు ప్రకాష్, శోభన్ బాబు, లక్ష్మీశ్రీనివాస్, శ్రీధర్ పెద్దసంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
