Rs.110 crore | గత ప్రభుత్వంపై ఘాటు విమర్శలు..

Rs.110 crore | గత ప్రభుత్వంపై ఘాటు విమర్శలు..
- గురుకులాలపై కూటమి ఫోకస్.. అసెంబ్లీలో మంత్రి సవిత హై వోల్టేజ్ రాజకీయ కౌంటర్
- డైట్ బకాయిలపై అసెంబ్లీలో హాట్ డిస్కషన్
- రూ.110 కోట్ల బకాయిలు క్లియర్ చేశామని కూటమి ప్రభుత్వం క్లెయిమ్
- గురుకులాల అభివృద్ధిపై రాజకీయ మాటల యుద్ధం
Rs.110 crore | శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : అసెంబ్లీలో బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ అంశాలపై రాజకీయ వేడి పెరిగింది. ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పీవీ పార్థసారథి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి ఎస్.సవిత గత ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. గత ప్రభుత్వం ఆరు నెలల పాటు డైట్ ఛార్జీలు చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసిందని, రూ.110 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం క్లియర్ చేసిన విషయం వాస్తవమని స్పష్టం చేశారు.
గతంలో బీసీ హాస్టళ్లు, గురుకులాలు నిర్లక్ష్యానికి గురై కనీస మరమ్మతులు లేక విద్యార్థులు కష్టాలు ఎదుర్కొన్నారని విమర్శించిన మంత్రి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు కేటాయించామని తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు సైతం సొంత నిధులతో హాస్టళ్ల అభివృద్ధికి ముందుకు వచ్చారని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, సౌకర్యాల కోసం సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు, యూపీఎస్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. మంత్రి నారా లోకేశ్ చొరవతో సన్నబియ్యంతో మెరుగైన భోజనం అందిస్తున్నామని చెప్పారు.
రాయలసీమ, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో ఎంజేపీ పాఠశాలలకు భారీ డిమాండ్ ఉందని, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 10 బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయనున్నామని, అసంపూర్తిగా ఉన్న ఎంజేపీ స్కూల్ భవనాల నిర్మాణానికి రూ.80 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో గురుకులాల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయని మంత్రి పేర్కొనడంతో అసెంబ్లీలో రాజకీయ చర్చలు మరింత వేడెక్కాయి.
