Rs.1.5 crore | గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు…
- విద్య జీవితానికి గొప్ప ఆయుధం…
- పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణ రావు…
Rs.1.5 crore | పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలని పెద్దపల్లి శాసనసభ్యుడు చింతకుంట విజయ రమణారావు(Vijaya Ramana Rao అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రూ. 1.5 కోట్ల(Rs.1.5 crore) డీఎంఎఫ్టీ నిధులతో నిర్మించనున్న నూతన గ్రంధాలయ భవన నిర్మాణ పనులను జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు ఈ రోజు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
అనంతరం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన 58వ జాతీయ గ్రంథాలయ(58th National Library) వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావుని శాలువాతో సన్మానించి నిప్పుల వాగు గ్రంధాన్ని బహుకరించారు.
జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా వారం రోజులపాటు నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం గ్రంథాలయాలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.
వివిధ ప్రాంతాల ప్రజలు పెద్దపల్లి పట్టణంలో నివసిస్తుండడంతో జనాభా పెరిగిందని, 40 సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఆధునిక హంగులతో నిర్మించనున్నట్లు తెలిపారు. ఆర్ అండ్ బీ(R&B) అధికారులతో మాట్లాడి జిల్లా కేంద్ర గ్రంథాలయానికి 12 గుంటల స్థలాన్ని కేటాయించి డీ.ఎం.ఎఫ్.టీ నిధులు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు.
సంవత్సరంలోపు బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఎంఈఓ సురేందర్ కుమార్, మాజీ కౌన్సిలర్లు, గ్రంథాలయ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.

