Robbery | దంపతులకు మత్తు ఇచ్చి మూడు కోట్ల న‌గ‌దు, భారీగా బంగారం దోపిడి

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని కాచిగూడలో ఓ వ్యాపారవేత్త ఇంట్లో భారీ దోపిడీ జరిగింది. వ్యాపారవేత్త దంపతులకు మత్తుమందు ఇచ్చి పెద్దమొత్తంలో డబ్బు, నగలు ఎత్తుకెళ్లారు. కాచిగూడకు చెందిన వ్యాపారవేత్త హేమ రాజ్‌ ఇంట్లో నేపాల్‌కు చెందిన వారు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి హేమరాజ్‌ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపిపెట్టారు. దానిని తిన్న వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో ఇంట్లో ఉన్న 2 కిలోల బంగారు నగలు, రూ.3 కోట్ల నగదుతో ఉడాయించారు.

స్థానికుల కథనం ప్రకారం.. కాచిగూడ లింగంపల్లిలోని అమ్మవారి ఆలయం సమీపంలో ఓ పారిశ్రామికవేత్త కుటుంబంతో కలిసి ఉంటున్నారు. వారం క్రితం నేపాల్కు చెందిన భార్యాభర్తలను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఆయన కుమారుడు, కోడలు విదేశీయాత్రకు వెళ్లారు. పారిశ్రామికవేత్త, ఆయన భార్య మాత్రమే ఉన్నారు. ఇదే అదనుగా ఆదివారం రాత్రి భోజనంలో పనివారు మత్తుమందు కలిపారు. దంపతులు మత్తులోకి వెళ్ల గానే.. ఇంట్లోని స్వర్ణాభరణాలు, నగదుతో ఉడాయించారు.

అయితే సోమవారం ఉదయం హేమరాజ్‌ వాకింగ్‌కు రాకపోవడంతో స్నేహితులు అతని ఇంటికి వచ్చారు. దంపతులిద్దరు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన వారు దవాఖానకు తరలించారు. తేరుకున్న తర్వాత ఇంటికి వచ్చిన హేమరాజ్‌ దంపతులు ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. దీంతో కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ దంపతులే దొంగతనానికి పాల్పడ్డట్టు పేర్కొన్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. పని మనుషులను ఎంచుకునే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *