Road Accident | ఇద్దరు మృతి, ఇద్దరికి గాయాలు..

Road Accident | ఇద్దరు మృతి, ఇద్దరికి గాయాలు..
Road Accident, శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం వీరజన్నాయపల్లి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. నల్లమాడ మండలం వాసుమూరిపల్లికి చెందిన గణేష్, అతని తమ్ముడు రాకేష్, మహేష్‌లు శివరాత్రి పర్వదినం సందర్భంగా లేపాక్షి వీరభద్రస్వామి దర్శనానికి ద్విచక్ర వాహనం పై వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్నారు. అదే సమయంలో ఓబులదేవరచెరువు మండలం ఉంట్లవారిపల్లికి చెందిన లక్ష్మీనారాయణ (45) పుట్టపర్తి వైపు వెళ్తుండగా వీరజన్నాయపల్లి సమీపంలో రెండు బైకులు ఢీకొన్నాయి.
ఈ ఘటనలో లక్ష్మీనారాయణ ఘటనాస్థలంలోనే మరణించారు. తీవ్రంగా గాయపడిన గణేష్‌ను మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. రాకేష్, మహేష్‌లకు చికిత్స కొనసాగుతోంది. మృతదేహాలను సంబంధిత ఆసుపత్రులకు తరలించారు. లక్ష్మీనారాయణ స్థానికంగా చికెన్ సెంటర్ నిర్వహించేవారని, ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని తెలిసింది. గణేష్ నల్లమాడ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థి. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటన పై పుట్టపర్తి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
