తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం..!

తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం..!
- బైకును తప్పించబోయి ఆటో బోల్తా
- ఓ యువకుడి మృతి, మరో యువకుడి పరిస్థితి విషమం
తాండూరు రూరల్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి ఆటో బొల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన తాండూరు మండలం చంద్రవంచ గేటు(Chandravancha Gate) సమీపంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
గ్రామస్తులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చంద్రవంచ గ్రామానికి చెందిన ఆటోలో చింతలకాడి దత్తు, చింతలకాడి జగదీష్, చెలక జగదీష్, కుమ్మరి కాలేషులు తాండూరుకు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తున్నారు. చంద్రవంచ గేటు సమీపంలోని ఆంజనేయ స్వామి దేవాలయం వద్దకు రాగానే కరణ్ కోట్ వైపు నుంచి వస్తున్న పల్సర్ బైకు(Pulsar Bike)ను తప్పించబోయి ఆటో బొల్తా కొట్టింది. ఈ క్రమంలో ఆటోలో ఉన్న చింతలకాడి దత్తు అక్కడిక్కడే మృతి చెందాడు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన చింతలకాడి జగదీష్ చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ కు రిఫర్ చేశారు. చెలక జగదీష్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. ప్రమాదంలో గాయపడిన కుమ్మరి కాలేష్ ను కుటుంభీకులు తాండూరు పట్టణంలోని బాలాజీ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మరోవైపు ప్రమాదంలో మృతి చెందిన దత్తును కుటుంభీకులు ఇంటికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దత్తు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు.
