ఒకవైపు నదులన్నీ ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్నాయి. రోడ్లన్నీ నదులను త‌ల‌పిస్తున్నాయి. వాన‌లు దంచికొడుతున్నాయి.. ఎటుచూసినా వనలు, వరదలే…. మరి ఇదేంటి, నదులన్నీ ఎండిపోతున్నాయని అనుకుంటున్నారా… మీరు క‌ర‌క్టుగానే చదివారు. అయితే, ఇది ఇక్కడ వార్త కాదండోయి..

అస‌లేం జ‌రిగిందంటే..

బ్రిటన్‌లో తీవ్ర నీటి కొరత కొనసాగుతోంది. వరుసగా నాలుగో హీట్‌వేవ్ దెబ్బకు పలు ప్రాంతాలు కరువుతో అల్లాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నీటి వినియోగాన్ని తగ్గించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రజలు తమ ఇన్‌బాక్స్‌లోని పాత ఈమెయిల్స్, అవసరం లేని ఫోటోలను డిలీట్ చేయాలని పిలుపునిచ్చింది.

డేటా సెంటర్లు – నీటి వినియోగంలో ‘దాగిన’ అసలు కథ

పాత ఈమెయిల్స్, ఫోటోలను భద్రపరచడంలో క్లౌడ్ సర్వీసులు కీలకం. ఈ క్లౌడ్ స్టోరేజ్ వెనుక పనిచేసే భారీ డేటా సెంటర్లు రోజుకు లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తాయి. ఆ సిస్టమ్స్ అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేకపోవడం వల్ల కూలింగ్ కోసం ఈ నీరు అవసరం అవుతుంది. ఒక పెద్ద డేటా సెంటర్ ఒక్క రోజులోనే 50 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిమాణం 10 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న పట్టణానికి ఒకరోజు సరిపోతుంది.

కరువు ప్రాంతాల్లో ప్రత్యేక హెచ్చరికలు

ప్రస్తుతం యూకేలోని యార్క్‌షైర్, కుంబ్రియా, లాంక్షైర్, గ్రేటర్ మాంచెస్టర్, మెర్సీసైడ్, చెషైర్, ఈస్ట్ మిడ్‌ల్యాండ్స్, వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ ప్రాంతాల్లో కరువు పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరికొన్ని ప్రాంతాలు పొడి వాతావరణంతో అల్లాడుతున్నాయి.

ప్రజలకు సూచనలు

యూకే ఎన్విరాన్‌మెంట్ ఏజెన్సీ వాటర్ డైరెక్టర్ హెలెన్ సూచనలు ఇలా ఉన్నాయి:

  • గార్డెన్‌కు నీరు పట్టేందుకు వర్షపు నీటిని సేకరించే రెయిన్ బట్‌లు ఉపయోగించాలి.
  • ఇంట్లోని లీకేజీలను తక్షణం సరిచేయాలి – దీని ద్వారా రోజుకు 200–400 లీటర్ల నీటిని సేవ్ చేయవచ్చు.
  • వంటగదిలో వాడిన నీటిని మొక్కలకు వినియోగించాలి.
  • బ్రష్, షేవింగ్ సమయంలో ట్యాప్ మూసివేయాలి.
  • షవర్ కింద తక్కువ సేపు స్నానం చేయాలి.
  • అవసరం లేని పాత ఈమెయిల్స్, ఫోటోలను వెంటనే డిలీట్ చేయాలి.

డిజిటల్ హైజీన్ – పర్యావరణ రక్షణకు కొత్త మార్గం

అవసరం లేని డేటాను క్లౌడ్ నుండి తొలగించడం ద్వారా డేటా సెంటర్లపై లోడును తగ్గించవచ్చ‌ని బ్రిట‌న్ ప్రభుత్వం అభిప్రాయం. దీని వలన కూలింగ్ కోసం అవసరమయ్యే నీటి వినియోగం కూడా తగ్గుతుంది. ప్రస్తుతం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలంటే, నీటి సంక్షోభం కేవలం తాగునీటి లోటు మాత్రమే కాకుండా, డిజిటల్ వినియోగంలో కూడా ప్రతిఫలిస్తున్నదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply