వరదతో కొంప కొల్లేరే..

- పెద్ద ఎండ్లగాడిలో పెరుగుతున్న నీటిమట్టం
- గ్రామాలకు రాకపోకలు బంద్
ఆంధ్రప్రభ, మండవల్లి (ఏలూరు జిల్లా) : ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో మండలం లోని పెద్ద ఎండ్లగాడి వద్ద కొల్లేరులో వరద నీటిమట్టం పెరుగుతూ, తగ్గుతూ దోబూచులాడుతుంది. శుక్రవారం మధ్యాహ్నానికి 2.5మీ లకు చేరిన నీటిమట్టం క్రమంగా తగ్గుతూ రాత్రి 8 గంటల సమయానికి 2.3 అడుగులకు చేరుకుంది.
క్రమంగా పెరుగుతూ,తరుగుతూన్న కొల్లేరు వరద ప్రజల్లో ఆందోళనను రేకెత్తిస్తుంది. అల్పపీడ ప్రభావంతో మరో నాలుగు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయి అన్న వాతావరణ అధికారులు హెచ్చరికతో సోమవారం సాయంత్రం వరకూ కొల్లేరు కి వరద పెరిగే అవకాశం ఉందని జల వనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.పెద ఎడ్ల గాడి వద్ద నీటిమట్టం 3 మీ లకు చేరుకుంటే గ్రామాలకు ముంపు తప్పదన్న విషయం తెలిసిందే.
అల్పపీడనం ప్రభావంతో కొద్దిరోజులగా కురు స్తున్న వర్షాలకు కొల్లేరులో వరద ఉధృతి పెరిగింది. ఎన్నడూ లేని రీతిలో కొల్లేరుకు ఎగువ 64 డ్రెయిన్ల నుంచి పెద్దఎత్తున వరద నీరు రావడంతో కొల్లేరు ఉగ్ర రూపం దాల్చింది.
దీంతో మండవల్లి మండలంలోని కొల్లేటి లంక గ్రామాలకు ప్రధాన రహదారి అయిన పెద్దఎడ్లగాడి వద్ద పెనుమాకలంక ఆర్అండ్ బి రహదారి శుక్రవారం ఉదయానికే మూడుచోట్ల వరద నీటిలో చిక్కుకోవడంతో రాకపోకలు నిలిచాయి. వరదనీటి ఉధృతితో మణు గూలూరులంక, పెనుమాకలంక, నందిగామలంక, శ్రీరామనగర్, ఇంగిలిపాకలంక, నుచ్చుమిల్లి, తక్కిళ్లపాడు, పుల్లపర్రు గ్రామాలకు ముంపు పొంచి ఉంది. కైకలూరు మండలంలో కొల్లేటికోటలోని సర్కారు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది.

