RGV – చాలా బిజీ – విచారణకు రాలేను
అమరావతి, ఆంధ్రప్రభ: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను వరుస కేసులు వెంటాడుతున్నాయి. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై అనుచిత పోస్టుల పెట్టిన కేసులో ఇప్పటికే ఎపి సీఐడీ విచారణకు వర్మ హాజరయ్యారు. ఇదే సమయంలో ఆయనకు మరో కేసులో సీఐడీ పోలీసులు నోటీసులు అందజేశారు. ఈరోజు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, తాజా సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నానని… విచారణకు హాజరు కావడానికి తనకు 8 వారాల సమయం ఇవ్వాలని కోరుతూ తన తరపు న్యాయవాదిని సీఐడీ కార్యాలయానికి వర్మ పంపారు.
దీంతో, వర్మకు రేపు మరోసారి నోటీసులు ఇవ్వాలని సీఐడీ అధికారులు యోచిస్తున్నారు. తాజా కేసు వివరాల్లోకి వెళితే… 2019లో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో ఒక సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం టైటిల్ పై కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే పేరుతో సినిమాను విడుదల చేశారు. అయితే, యూట్యూబ్ లో మాత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతోనే విడుదల చేశారంటూ మంగళగిరి సమీపంలోని ఆత్మకూర్ కు చెందిన బండారు వంశీకృష్ణ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను కూడా తొలగించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ మనోభావాల దెబ్బతినేలా సినిమా తీశారని చెప్పారు. దీంతో, మంగళగిరిలోని సీఐడీ పోలీస్ స్టేషన్ లో నవంబర్ 29న కేసు నమోదయింది. ఈ క్రమంలో, ఆర్జీవీకి సీఐడీ పోలీసులు నోటీసులు అందించారు. ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉండగా… ఆయన డుమ్మా కొట్టారు.