RGV | సెన్సార్ బోర్డ్ కు కాలం చెల్లిందా..?

RGV | సెన్సార్ బోర్డ్ కు కాలం చెల్లిందా..?
RGV | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తన మాటలతో.. సోషల్ మీడియాలో పోస్టులతో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంటాడు అనేది తెలిసిందే. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి సెన్సార్ బోర్డ్ ను టార్గెట్ (Target) చేశాడు. తను ఫీలైంది ఏదైనా సరే.. ఉన్నది ఉన్నట్టుగా ఎలాంటి భయం లేకుండా చెప్పే వర్మ.. ఈసారి సెన్సార్ బోర్డ్ పై తనదైన స్టైల్ లో ఫైర్ అయ్యాడు. ఇంతకీ.. వర్మ ఏమన్నాడు..?

RGV | ఇంతకీ వర్మ ఏమన్నారంటే..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మూవీ జన నాయగన్. ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కావాలి కానీ.. సెన్సార్ బోర్డ్ వలన పోస్ట్ పోన్ అయ్యింది. ఈ విషయం పై వర్మ సోషల్ మీడియాలో (Social Media) తనదైన స్టైల్ స్పందించారు. ఇంతకీ వర్మ ఏమన్నారంటే.. ఈ రోజుల్లో సెన్సార్ బోర్డుకు ఇంకా ప్రాముఖ్యత ఉందని భావించడం అవివేకం. దాని అవసరం ఎప్పుడో తీరిపోయింది. కానీ దాని పై చర్చించే బద్ధకంతో దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. దీనికి ప్రధాన బాధ్యత చిత్ర పరిశ్రమదే అని వర్మ అన్నారు. అంతే కాకుండా… ప్రస్తుతం మనం జీవిస్తున్న కాలంలో 12 ఏళ్ల పిల్లాడు కూడా గోప్రో కెమెరాతో చిత్రీకరించిన టెర్రరిస్ట్ హత్యను ఫోన్లో చూడగలడు. 9 ఏళ్ల చిన్నారికి హార్డ్‌కోర్ పోర్న్ సైట్లు తారసపడొచ్చు. విపరీతమైన భావజాలాన్ని, కుట్ర సిద్ధాంతాలను ఎవరైనా, ఎక్కడైనా, ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడొచ్చు.

RGV | వర్మ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్
అన్నీ ఇప్పటికిప్పుడు అందుబాటులో ఉన్నాయి. మరో వైపు న్యూస్ ఛానళ్ల నుంచి యూట్యూబర్ల వరకు సమాజంలో ప్రతి ఒక్కరూ బూతులు మాట్లాడుతున్నారు అని వర్మ ప్రస్తుత పరిస్థితిని వివరించారు. వర్మ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీని గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. గోడలు పగిలిపోయి, లోపల ఉన్నది ప్రతీ ఒక్కరికీ కనిపిస్తున్న భవనానికి వాచ్‌మెన్‌ను పెట్టడం ఎంత అవివేకమో, ఈ రోజుల్లో సెన్సార్ బోర్డును సమర్థించడం కూడా అంతే అన్నారు వర్మ. సెన్సార్ బోర్డ్ కు (Sensor board) కాలం చెల్లిపోయిందని అంగీకరించే ధైర్యం అధికారులకు, వారిని ప్రశ్నించే సంకల్పం చిత్ర పరిశ్రమకు ఉందా అని వర్మ నిలదీశారు. ఒక సినిమాకు సమస్య వచ్చినప్పుడు కాకుండా, ఈ వ్యవస్థపైనే ఇండస్ట్రీ సమష్టిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. మరి.. సెన్సార్ బోర్డ్ సమస్య గురించి ఇండస్ట్రీలో ఇంకెవరైనా రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.
