Return Gift |అమెరికాకు చైనా షాక్ .. హేవీ రేర్ ఎర్త్ ఖ‌నిజాల ఎగుమ‌తులు నిలిపివేత

అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనా కీల‌క నిర్ణ‌యం
అరుదైన భూ లోహాలు, అయస్కాంతాలపై ఆంక్షలు
రక్షణ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాలపై తీవ్ర ప్రభావం
అమెరికా సుంకాల పెంపునకు ప్రతిగా చైనా చర్య
ప్రపంచ సప్లై చైన్ కు అంతరాయం, ప్రత్యామ్నాయాలపై దృష్టి

బీజింగ్ – అమెరికా, చైనాల మధ్య వాణిజ్య పోరు మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో, కీలకమైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, సంబంధిత లోహాలు, అయస్కాంతాల ఎగుమతిపై చైనా కఠిన ఆంక్షలు విధించింది. ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్, సెమీకండక్టర్లు సహా అనేక కీలక రంగాలకు అత్యవసరమైన ఈ ముడిసరుకుల సరఫరాను నియంత్రించడం ద్వారా పాశ్చాత్య దేశాలను, ముఖ్యంగా అమెరికాను ఇరుకున పెట్టేందుకు బీజింగ్ ప్రయత్నిస్తోంది.

ఎగుమతుల కోసం చైనా ప్రభుత్వం సరికొత్త నియంత్రణ వ్యవస్థను రూపొందిస్తున్నది. ఈ విధానాలు ఖరారయ్యే వరకు, కార్ల నుంచి క్షిపణుల వరకు అనేక ఉత్పత్తుల తయారీకి అత్యవసరమైన అయస్కాంతాల రవాణాను పలు ఓడరేవుల్లో చైనా నిలిపివేసినట్లు ‘ది న్యూయార్క్ టైమ్స్’ నివేదిక వెల్లడించింది.

ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే, అమెరికా సైనిక కాంట్రాక్టర్లతో సహా కొన్ని నిర్దిష్ట కంపెనీలకు ఈ కీలక పదార్థాల సరఫరా శాశ్వతంగా నిలిచిపోయే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా ఉత్పత్తులపై సుంకాలు భారీగా పెంచిన నేపథ్యంలో ప్రతీకారంగా బీజింగ్ ఈ ఆంక్షలను విధించింది. ప్రపంచంలోని రేర్ ఎర్త్స్ ఉత్పత్తిలో దాదాపు 90 శాతం చైనాలోనే జరుగుతోంది. రక్షణ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంధన, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలలో ఉపయోగించే సమేరియం, గాడోలినియం, డిస్ప్రోసియం వంటి ఏడు కీలకమైన మీడియం, హెవీ రేర్ ఎర్త్స్ లను ఎగుమతి నియంత్రణ జాబితాలో చేర్చారు. అమెరికాలో ఒకే ఒక్క రేర్ ఎర్త్స్ గని ఉండటంతో, సరఫరా కోసం ఆ దేశం చైనాపైనే అధికంగా ఆధారపడుతోంది. టెస్లా, ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీలు చైనా రేర్ ఎర్త్స్‌పై ఆధారపడుతున్నాయి.

ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, రోబోట్లు, క్షిపణులు, స్మార్ట్‌ఫోన్లు, కృత్రిమ మేధ సర్వర్ల వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి గుండెకాయ వంటి కీలక భాగాల తయారీలో ఈ రేర్ ఎర్త్ లోహాలు అత్యంత ఆవశ్యకం. చైనా తాజా చర్య ప్రపంచ సప్లై చైన్ పై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని, వాణిజ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *