సంయమనం..

సంయమనం..
- సమన్వయం
- అధికారులందరూ కలసి కట్టుగా.. సిద్ధం
- కోఆర్డినేషన్ వ్యూహం
- ఇటు పోలీసులు అలెర్ట్
- అటు రెవెన్యూ కమాండ్ కంట్రోల్
- అహర్నిశం కార్పొరేషన్ రెడీ
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రి(Indrakeeladri)పై ప్రతిష్టాత్మకంగా జరిగే శరన్నవరాత్రోత్సవ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా తెలంగాణా, కర్నాటక ప్రాంతాల నుంచి కనకదుర్గమ్మదర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ నేపథ్యంలో నగరానికి చేరే భక్తులు.
యాత్రికుల భద్రత దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్ట భద్రత ఏర్పాట్లపై విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజ శేఖర బాబు(Police Commissioner SV Rajasekhara Babu) పకడ్బందీ ప్రణాళికను రచించారు. అమలు చేస్తున్నారు.
సుమారు 4500 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని రంగంలోకి దించారు. వివిధ జిల్లాల నుంచి విజయవాడలో దసరా బందోబస్తు విధులకు వచ్చిన పోలీసు సిబ్బంది, అధికారులకు ఆదివారం (21.09.2025వ తేదీన) తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజ శేఖర బాబు మార్గదర్శకాలు, సూచనలు, సలహాలతో దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, విజయవాడ నగరం(Vijayawada City)లో పదకొండు రోజుల పాటు జరిగే దసరా వేడుకలకు ప్రత్యేక విశిష్టత, ప్రాధాన్యతలు ఉన్నాయని, దసరా ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు నగరానికి విచ్చేసే అవకాశం ఉందన్నారు.
ఈ క్రమంలో రోటీన్ బందోబస్త్(Bandobast) లాగా కాకుండా కొంత మనసు పెట్టి భక్తిశ్రద్ధలతో విధులు నిర్వహిస్తే భక్తుల మన్ననలతో పాటు కనక దుర్గమ్మ ఆశీస్సులు లభిస్తాయన్నారు. యూనిఫాం(uniform)లో విధులు నిర్వహించే సమయంలో ఇతరులు మనల్నిగమనిస్తుంటారనే విషయం గుర్తుంచుకోవాలని, బందోబస్తు నిర్వహించే సందర్భంలో పాటించాల్సిన మార్గ దర్శకాలు, విధి నిర్వహణలో వ్యవహరించే తీరును ప్రతి ఒక్క పోలీసు అధికారి, సిబ్బంది తెలుసుకోవాలన్నారు.
మూడు షిఫ్టుల్లో బందోబస్తు(bandobast) విధులు నిర్వహించే ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి మరింత సమర్ధవంతంగా బందోబస్తు విధులు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది ఇతర శాఖల సిబ్బందితో గానీ, వి.ఐ.పీలతో గానీ వివాదాలకు తావులేకుండా సమన్వయం చేసుకోవాలని, ఇటువంటి బందోబస్తుల్లో సమన్వయంతో వ్యవహరిస్తే సజావుగా సాగుతుందన్నారు.
సామాన్య భక్తులకే ప్రాధాన్యం
దర్శనానికి వచ్చేసాధారణ భక్తులకు తొలి ప్రాధాన్యం ఇచ్చిఅధికారుల నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ మర్యాధగా వ్యవహరిస్తూ సక్రమంగా కనక దుర్గమ్మ(Kanaka Durgamma) దర్శనం అయ్యేలా చూడాలని, అదే సమయంలో క్యూలైన్లలో ఏవిధమైన ఘటనలకు ఆస్కారం లేకుండా క్యూలైన్లలో భక్తులు సక్రమంగా కదిలేలా కృషి చేయాలన్నారు.
బందోబస్తు సందర్భంగా నిర్దేశించిన ప్రదేశంలో విధులు నిర్వహించడంతో పాటు రిలీవర్(reliever) వచ్చే వరకు పాయింటు వదలి వెళ్ళకూడదని సిబ్బందికి తెలియజేశారు. బందోబస్తులో ప్రధానపాత్ర వహించే సెకార్డ్ ఇన్ ఛార్జ్ లు అప్పటి కప్పుడు జరిగే సంఘటనలను అంచనా వేసి చురుగ్గా వ్యవహరించాలన్నారు. అదేవిధంగా కామాండ్ కంట్రోల్ నుండి సీసీ.కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఉంది. కావున అప్రమత్తంగా వ్యవహరిస్తూ విధులు(duties) నిర్వహించాలి, అని సీపీ సూచించారు.
కోఆర్డినేషన్ వ్యూహం
ఈ సారి అన్నీ శాఖలను సమన్వయం చేసుకుని కమాండ్ కంట్రోల్(command control)ను ఏర్పాటు చేశామని, అక్కడ అన్నీ శాఖల అధికారులు ఉంటారు, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే కమాండ్ కంట్రోల్‌కు తెలియజేస్తే తక్షణమే అధికారులు స్పందిస్తారు, ఆయా సెక్టర్ల అధికారులకు సమాచారం ఇస్తారు, వెంటనే చర్యలు తీసుకుంటారు, అని పోలీసు కమిషనర్ వివరించారు.
ముఖ్యంగా క్యూ లైన్ల లో హోల్డింగ్ ఏరియాలో భక్తులకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని గుర్తిస్తే వెంటనే కమాండ్ కంట్రోల్ కు తెలియజేస్తే, చర్యలు తీసుకుంటారని తెలిపారు, క్యూలైన్ల లో భక్తులు ఫ్రీఫ్లో(Freeflow)లో వెళ్ళేవిధంగా చూసుకోవాలని, ఆ సెక్టర్లలలో సిబ్బందికి ఆ పాయింట్ వద్దే బ్రీఫింగ్(briefing) ఇవ్వాలని, సిబ్బందికి ఏవైనా అనుమానాలు లేదా సమస్యలు ఉంటే సంబంధిత సెక్టార్ ఇన్ ఛార్జ్ కు లేదా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
గత ఏడాది వీడియోల(Videos)ను చూపిస్తూ ఎక్కడా రద్దీ ఏర్పడకుండా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని వివరించారు. బందోబస్తు విధులు నిర్వహించే సిబ్బందికి సమయానికి టిఫిన్, భోజనం అందిస్తారని, మనస్ఫూర్తిగా విధులు నిర్వహిస్తే ఉత్సవాలు విజయవంతం అవుతాయని తద్వారా ఆయా యూనిట్ల( Units)తో పాటు పోలీస్ శాఖకు రాష్ట్రానికి మంచి పేరు వస్తుందని పోలీసు కమిషనర్ ఉత్తేజ పరిచారు.
ఇది టీమ్ ఎన్టీఆర్..
జిల్లా కలెక్టర్ లక్ష్మీశా(District Collector Lakshmisha) మాట్లాడుతూ.. నెల రోజులుగా తామిద్దరూ ప్రతిరోజూ దసరా ఏర్పాట్లపై చర్చించుకుని, అన్ని శాఖలను సమన్వయం చేసుకుని పట్టిష్ట ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ సారి ప్రత్యేకంగా విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నందున ప్రతి చిన్న విషయాన్నికూలంకషంగా చర్చించి చర్యలు చేపట్టామన్నారు.
భక్తులతో సంయమనం పాటిస్తూ విధులు నిర్వహించాలని, విధులు నిర్వహిస్తున్నసమయంలో మనం కూడా సామాన్య భక్తులు లాగా ఆలోచిస్తూ విధులు నిర్వహించాలని, మీరు విధులు నిర్వహిస్తున్న ప్రదేశాలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని గుర్తిస్తే వెంటనే సమీపంలోని క్యూఆర్ కోడ్‌తో తెలపాలని, టీమ్ ఎన్.టీ.ఆర్. అంటే మనం అందరం అని, అందరం కలిసి కట్టుగా పనిచేసి ఈ దసరా మహోత్సవాలను విజయవంతం చేయాలని తెలిపారు.
నిత్యం మెలుకవగా.. పని చేద్దాం
వీఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్(VMC Commissioner Dhyan Chand) మాట్లాడుతూ.. ఈ దసరా మహోత్సవాల సందర్భంగా దాదాపు 10 వేల మంది విధులు నిర్వహిస్తున్నాం, ప్రతి ప్రదేశంలో శానిటేషన్‌కు ఇబ్బందులు కనపడితే వెంటనే కామాండ్ కంట్రోల్ కు తెలియజేయాలని తెలిపారు. అన్నీముఖ్య ప్రదేశాలలో టాయిలెట్ల(Toilets)ను ఏర్పాటు చేశామని, ఈ సారి 35 లక్షల వాటర్ బాటిల్స్ లను సిద్ధం చేస్తున్నామని, 24/7 ఆయా ప్రదేశాలలో సిబ్బందితో త్వరితగతిన క్లియర్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
ప్రతిదీ అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేయాలని తెలిపారు. వర్షాలు వచ్చిన సమయంలో కూడా సంయమనం పాటిస్తూ విధులు నిర్వహించాలని, ఎక్కడైనా వర్షపు నీరు ఆగిపోతే వెంటనే సమాచారం ఇస్తే తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో డీసీపీలు కేజీవీ సరిత, తిరుమలేశ్వర రెడ్డి , ఉదయరాణి ఎస్వీడీ ప్రసాద్, సాయి ప్రసాద్, ఆనందరెడ్డి, ఉదయాభాస్కర్, ఏడీసీపీలు రామకృష్ణ, కె.కోటేశ్వర రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.


